
- హెరిటేజ్ టూరిజంలో గోల్కొండ, చార్మినార్ సత్తా
- టాప్–10 లో నిలిచిన మన చారిత్రాత్మక కట్టడాలు
- ఏఎస్ఐ హెరిటేజ్ విజిటర్స్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను ఎంత మంది సందర్శిస్తున్నారో చెప్పే జాబితాను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్ఐ) రిలీజ్చేసింది. ఇందులో టాప్–10లో హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినార్ చోటు దక్కించుకున్నాయి. గోల్కొండ 6వ స్థానాన్ని దక్కించుకోగా, చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది.
ఏటా లక్షల్లో సందర్శకుల తాకిడి
హైదరాబాద్‌లో టూరిస్ట్ ప్రాంతాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలతోపాటు ఫారినర్స్ తరలివస్తున్నారు. 2022–23లో గోల్కొండను 15.27 లక్షల మంది సందర్శించగా, 2023–2024లో ఆ సంఖ్య 16.08 లక్షల మందికి పెరిగినట్టు ఏఎస్ఐ సర్వే వెల్లడించింది. అలాగే, చార్మినార్‌ను 2022–23లో 9.29 లక్షల మంది సందర్శించగా.. తాజాగా ఆ సంఖ్య 12.90 లక్షలకు పెరిగింది. 2019 తర్వాత హైదరాబాద్‌కు దాదాపు 30 శాతం సందర్శకులు పెరిగినట్టు సర్వేలో తేలింది. అలాగే, రాష్ట్రంలో హెరిటేజ్ సైట్ల విజిటర్ల నుంచి సుమారు రూ.18వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నట్టు సర్వే వెల్లడించింది.
టాప్ –1లో తాజ్‌మహల్
2022 – 2024 వరకు అత్యధిక సందర్శకుల తాకిడి కలిగిన టాప్– 10 హెరిటేజ్ ప్రాంతాల జాబితాలో తాజ్ మహల్ అగ్రస్థానంలో నిలిచింది. 2023–-24లో 60.99 లక్షల మంది టూరిస్టులు తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీని తర్వాత కోణార్క్ లోని సూర్య దేవాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్ర కోట వరుసగా 2, 3,4 స్థానాల్లో ఉన్నాయి. ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహలు ఐదో స్థానంలో ఉండగా.. దాని తర్వాత గోల్కొండ కోట ఆరో స్థానాన్ని పొందింది. ఆగ్రా కోట, ఔరంగాబాద్‌లోని బీబీ కా మక్బరా, హైదరాబాద్ లో చార్మినార్ , పుణెలోని శనివార్ వాడ టాప్– 10 లో నిలిచాయి.