భారీ వర్షాలే కారణమా..?
పరిసరాలన్నీ చెత్తా చెదారంతో మురుగు కంపు
పట్టించుకోని ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గోల్కొండ కోట. హైదరాబాద్ కే ఐకాన్ అయిన ఈ కోటది వందల ఏళ్ల చరిత్ర. ఆనాటి నవాబుల రాజసానికి చిహ్నం. నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం. ట్రంప్ కూతురు ఇవాంక కూడా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గోల్కొండ కోటనే సందర్శించారు. అలాంటి వైభవం కోట సొంతం. కానీ ఆ వైభవం ఇప్పుడు మసకబారుతోంది. క్రమంగా రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక్కడి గోడలు కూలుతున్నయ్. పరిసరాలు చెత్తా, చెదారంతో కంపు కొడుతున్నయ్. కోట చుట్టూ ప్రాంతాలు మందులు బాబులకు అడ్డాలుగా మారాయి. అయినా పట్టించుకునే వారే లేదు. ఆర్కియాలజీ అధికారులు కోటపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గోడలకు పగుళ్లు వచ్చి, పరిసరాలు ఆనవాళ్లు లేకుండా పోయినా అస్సలు కేర్ చేస్తలేరు. మొన్నటి వరద బీభత్సానికి గోల్కొండ కోట మొత్తం ఆగమైతే ఇప్పటికీ దాన్ని బాగు చేయించే దిక్కు లేదు.
కూలిన గోడలు
వరదల ధాటికి కోటలోని లోపలి భాగంలో మూడు గోడలు కూలిపోయాయి. బయట వైపు ఉండే ఓ గోడ కూడా పడిపోయింది. అప్పటికే పగుళ్లు ఉన్న గోడలకు తోడు మామూలువి కూడా నీళ్లలో నాని పడిపోయాయి. ఇది జరిగి రెండు నెలలు గడస్తున్నా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. రీస్టోరేషన్ వర్క్స్ ను ఆర్కియాలజీ అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. గోడలు కూలిన టైమ్ లోనే డిపార్ట్ మెంట్ కు సమాచారం ఇవ్వడంతో పాటు రీస్టోరేషన్ కు అయ్యే ఖర్చుల వివరాల ఎస్టిమేషన్ వేసి పంపామని గోల్కొండ ఇన్ చార్జి నవీన్ కుమార్ తెలిపారు. కానీ ఇప్పటి వరకు పైసాకు కూడా అప్రూవల్ రాలేదు. కూలిన గోడలతో కోట అందాలను కోల్పోతోంది. ఎప్పటికప్పుడు రిస్టోరేషన్ చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫండ్స్ వచ్చిన తర్వాతే ఏదైనా పనులను ప్రారంభిస్తామని చెబుతున్నారు.
ఎక్కడికక్కడే చెత్త
కోట మెయింటెన్స్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. దర్వాజాల్లో ఎటు చూసినా క్లీన్ నెస్ కనిపించడం లేదు. మోతీ దర్వాజ దగ్గర పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త పడేసి ఉంది. డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది. ఈ దారిలో వెళ్లే ప్రయాణికులు కంపు భరించలేకపోతున్నరు. గోల్కొండ చుట్టూ 8 దర్వాజాలు ఉంటే ప్రధాన దర్వాజా మినహా అన్ని చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. కోట చుట్టుపక్కల శుభ్రత విషయాన్ని పట్టించుకోవడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశీయులు కూడా గోల్కొండను సందర్శిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో సరైన నిర్వహణ లేకపోతే అది సిటీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు.