రేపట్నుంచే గోల్కొండ బోనాలు

రేపట్నుంచే గోల్కొండ బోనాలు

మెహిదీపట్నం/బేగంపేట, వెలుగు: గోల్కొండ కోట శ్రీ జగదాంబికా మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి బోనాల ఉత్సవాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ప్రతి గురు, ఆదివారాల్లో అమ్మవారికి మొత్తం 9 ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు కేటాయించిందని ఆలయ ఈఓ శ్రీనివాస్ రాజు తెలిపారు. ఏటా 4, 5 పూజల రోజున లక్షల మంది భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ ఆరేళ్ల జగదీశ్​యాదవ్ చెప్పారు. 22న ఉదయం కుమ్మరి సంఘం, ఆలయ కమిటీ సంయుక్తంగా మొదటి బోనం సమర్పిస్తారని తెలిపారు.

 ఆషాఢ మాసంలోని గురు, ఆదివారాల్లో కోటలోకి వచ్చే భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదని పురావస్తు శాఖ కోట ఇన్ చార్జి నవీన్ కుమార్ తెలిపారు. బోనాల నేపథ్యంలో లంగర్​హౌస్​ చౌరస్తా నుంచి కోటలోని అమ్మవారి ఆలయం వరకు 600 మంది సిబ్బందితో బందోబస్త్​ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ ​అండ్ ​వెస్ట్​జోన్​డీసీపీ కిరణ్ ఖరే వెల్లడించారు. నిఘా కోసం 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

హుండీ ఆదాయం రూ.27.36లక్షలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోని హుండీలను మంగళవారం లెక్కించారు. 2 నెలల18 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో రూ.27లక్షల36వేల259 సమర్పించినట్లు దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్ దేవి, ఈవో మనోహర్ ​రెడ్డి వెల్లడించారు.