రూ. 5 లక్షలు, 10 తులాల బంగారం చోరీ

కారేపల్లి, వెలుగు : ఎవరూ లేని టైంలో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 5 లక్షలు, 10 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సుడిగాలి విజయ్‌‌భాస్కర్‌‌ దంపతులు తమ కూతురు అక్షరాభ్యాసం కోసం ఈ నెల 9న బాసర వెళ్లారు. బాసరకు వెళ్లే ముందు రోజు ట్రాక్టర్‌‌ను అమ్మగా వచ్చిన రూ. 5 లక్షలతో పాటు, మరో 10 తులాల బంగారు నగలను బీరువాలో పెట్టి వెళ్లారు. 

విజయ భాస్కర్‌‌ తండ్రి గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే టైంలో విజయ్‌‌ భాస్కర్‌‌ దంపతులు సైతం ఇంటికి వచ్చారు. అనంతరం విజయ్‌‌ భార్య తన మెడలో ఉన్న హారాన్ని బీరువాలో పెట్టేందుకు వెళ్లగా తాళం పగులగొట్టి కనిపించింది. వెంటనే బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన డబ్బు, బంగారం కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాజారాం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.