Gold Rates: డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి బంగారం భగ భగ.. బట్టలు పిరం

Gold Rates: డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి బంగారం భగ భగ.. బట్టలు పిరం

 

  • డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఎఫెక్ట్
  • డెయిరీ ఉత్పత్తులకు తగ్గనున్న గిరాకీ
  • చెప్పులకు తిప్పలు.. సీఫుడ్ వెరీ కాస్ట్లీ
  • అమెరికాలో మన ఉత్పత్తులపై నీలినీడలు

వాషింగ్టన్ డీసీ:  అమెరికా అధ్యక్షుడు టారిఫ్స్ కొరడా ఝుళిపించారు. భారత్ తమకు వాణిజ్య బాగస్వామి అని చెబుతూనే టారిఫ్స్ మోత మోగించారు. 26% సుంకాలు విధించడంతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులు అక్కడ మరింత పిరం కానున్నాయి.  భారత్‌ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ట్రంప్‌ నిర్ణయంతో మన దేశంలోకి కొన్ని రంగాలపై కీలక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ, ఫార్మా ఉత్పత్తులపై ఎఫెక్ట్‌ ఉండనున్నట్లు పేర్కొంటున్నారు.  వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత రొయ్యలు, ఇతర సీఫుడ్‌ ఉత్పత్తులకు యూఎస్‌ ప్రధాన దిగుమతి దారుగా ఉంది. 2024లో అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్‌ సీఫుడ్‌ ఎగుమతుల విలువ 2.58 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇప్పుడు తాజా సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి. దీంతో గిరాకీ పడిపోయే అవకాశం ఉంది.  మన డెయిరీ ఉత్పత్తులపై టారిఫ్‌లు 38.23 శాతానికి చేరనున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు కూడా పెరుగుతాయి. 181.49 మిలియన్‌ డాలర్ల డెయిరీ ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెర, కోకో ఎగుమతులపైనా ప్రభావం పడనుంది.

బంగారం, బట్టలు పిరం:
 భారత్‌ నుంచి ఏటా 11.88 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అమెరికాకు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయి.  వీటిపై సుంకం 13.32 శాతానికి చేరనుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఇక, జౌళి పరిశ్రమ పైనా అధిక ప్రభావమే ఉంటుంది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 9.6 బిలియన్‌ డాలర్ల విలువైన దుస్తులు, ఇతర టెక్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్స్‌ ఎగుమతి అవుతున్నాయి. మనం చేసే మొత్తం టెక్స్‌టైల్‌ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. ఇండియా నుంచి  457.66 మిలియన్‌ డాలర్ల విలువైన ఫుట్‌వేర్‌ ఉత్పత్తులు యూఎస్‌కు ఎగమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా-భారత్‌ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56 శాతంగా ఉంది. దీంతో అగ్రరాజ్య మార్కెట్లో మన చెప్పుల ధరలు మరింత పిరం కానున్నాయి. దీంతో అక్కడి వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.   2024లో 14.39 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో యూఎస్‌ మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక, బాయిలర్లు, టర్బైన్స్‌, కంప్యూటర్ల వంటి ధరలు కూడా పెరుగుతాయి.