- 30 తులాల గోల్డ్, కిలో వెండి అపహరణ
అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. తారామతిపేటలో మధుచారి కుటుంబం నివసిస్తోంది. కొడుక్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మధు భార్య తల్లి గారింటికి వెళ్లింది. కాగా.. సోమవారం రాత్రి 10.30 గంటలకు అతను కూడా అత్తారింటికి వెళ్లాడు.
మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పక్కింటివారు ఫోన్ చేసి .. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు. దీంతో మధు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 30 తులాల బంగారంతో పాటు కిలో వెండి కనిపించలేదు. బాధితుడు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా తమ ఇంట్లో చోరీ జరిగిందని మధు భార్య వాపోయింది. వరుస చోరీలతో శివారు కాలనీల ప్రజల్లో భయాందోళన నెలకొంది.