
బెల్లంపల్లి, వెలుగు: తాళం వేసిన ఇళ్లల్లో చొరబడిన దుండగులు ఆభరణాలు, డబ్బులు, బయట నిలిపిన బైక్లను ఎత్తుకెళ్లారు. సీఐ అఫ్జలొద్దీన్ వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సాన శ్రవణ్స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, బీరువాలోని 14 తులాల బంగారం, కిలోన్నర వెండి అపహరించారు.
పక్కనే ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుధాకర్ ఇంట్లో దూరి, రూ.70 వేలతోపాటు 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇదే ఏరియాలో నిలిపి వున్న 4 బైక్లను చోరీ చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ రవికుమార్, సీఐ అఫ్జలొద్దీన్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, టూ టౌన్ ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీపీ ఫుటేజీలో 8 మంది దొంగలు బ్రిడ్జి మీదుగా బైక్లను తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.