
తొర్రూరు, వెలుగు: పని కోసం అడ్డాపై ఉన్న మహిళా కూలీలను నమ్మించి బైక్ పై తీసుకెళ్లి పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన గూబ కొమరమ్మ, భూక్య సునీత పట్టణంలోని అన్నారం రోడ్ లోని అడ్డాపై పని కోసం వేచి ఉన్నారు. వారిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి పని ఉందని ఇద్దరిని బైక్ పై ఎక్కించుకున్నాడు.
మహబూబాబాద్ కు వెళ్లే రోడ్డులోని పీజీ తండా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపగా, మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వారిద్దరు కలిసి మహిళలను బెదిరించి గూబ కొమురమ్మ మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని ఉడాయించారు. కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, అన్నారం రోడ్డులో మహిళలను బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మరో ఇంట్లో చోరీ..
తొర్రూరు పట్టణంలోని మూల మహేశ్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి నగలు ఎత్తుకెళ్లారు. వేరే ఊరికి వెళ్లగా, ఇంటి తాళాలు పగలగొట్టి రెండు తులాల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.