
బంగారం ధర తులం లక్ష రూపాయలు దాటింది. ఇవాళ(మంగళవారం, ఏప్రిల్ 22, 2025) ఫస్ట్ టైం లక్ష రూపాయలు దాటి లక్షా 13వందల 50 రూపాయలు పలికి బంగారం కొండెక్కి కూర్చుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు కాకుండానే తులం బంగారం 1,01,350 రూపాయలకు చేరింది. ఇండియాలో బంగారంపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది. అంటే.. లక్షా 13 వందల 50 రూపాయల ధరపైనే చూసుకుంటే.. జీఎస్టీ రూ.3,040.5 పడుతుంది.
ఇందులో.. CGST 1.5 శాతం, SGST 1.5 శాతం. అంటే.. తులం బంగారంపై CGST రూ.1,520.25, SGST రూ.1,520.25 పడుతుంది. మొత్తంగా.. ప్రస్తుతం బంగారం ధరలను బట్టి చూస్తే.. తులం బంగారంపై 3వేలకు పైగానే జీఎస్టీ పడుతుంది. ఇవి కాక.. ఇతర పన్నులు కూడా కలిపితే బంగారం తులం ధర లక్ష పది వేల వరకూ పోయినా ఆశ్చర్యం లేదు.
బంగారం ధరలు ఇలా లక్ష రూపాయలు దాటడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం. రెండోది అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన, భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కూడా కనబడుతోంది. మూడోది భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం. చివరగా అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించి నగదు ప్రజల చేతుల్లో పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుందనే వార్త కూడా బంగారంపై పెట్టుబడులకు గిరాకీకి కారణమైంది.
ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ రాజకీయ ఉద్వేగాలు, యూరప్లో నాయకత్వ మార్పులు కూడా బంగారం విలువను పెరిగే విధంగా ప్రధాన కారకాలుగా ఉన్నాయి. బంగారంపై ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. చైనా, ఇండియా, రష్యా వంటి దేశాలు గోల్డ్ రిటర్న్ పెంచుకుంటూ ఉన్నాయి.