
- మరో రూ.1,650 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు
- గత నాలుగు నెలల్లో రూ.21 వేల పైకి
- ట్రంప్ టారిఫ్ వార్, డాలర్ విలువ పడడమే కారణం
- పెళ్లిళ్లతో ఇండియాలోమరింత డిమాండ్
- రానున్న పండుగ సీజన్‌లో రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్
న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాములు గోల్డ్ రేటు దేశ రాజధాని ఢిల్లీలో రూ. లక్ష మార్కుకు చేరువైంది. కేవలం రూ. 200 దూరంలో ఉంది. డాలర్ విలువ పడుతుండడంతో పాటు, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో డాలర్‌కు డిమాండ్ పడిపోతోంది. ఇన్వెస్టర్లు డాలర్ కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు యూఎస్–-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో బంగారం ధరలు వెనుతిరిగి చూడడం లేదు. 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్లు) ధర ఢిల్లీలో సోమవారం రూ. 1,650 పెరిగి రూ.99,800కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఈ రేటు శుక్రవారం రూ. 98,150 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,600 పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి అయిన రూ. 99,300కి చేరింది. కిందటేడాది డిసెంబర్ 31 నుంచి ఇప్పటివరకు చూస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ. 21 వేలు లేదా 26.41 శాతం పెరిగింది. వెండి ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. కేజీకి రూ. 500 పెరిగి రూ. 98,500కు చేరాయి. వెండి ధరలు శుక్రవారం రూ. 98,000 వద్ద ఉన్నాయి. హైదరాబాద్‌లో10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర సోమవారం రూ.770 పెరిగి రూ.98,350 కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.90,150 కి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో బంగారం ఫ్యూచర్స్ ( జూన్ డెలివరీ ) రూ. 1,621 లేదా 1.7 శాతం పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి రూ. 96,875కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం సోమవారం ఔన్స్‌కు 3,397.18 డాలర్ల వద్ద కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ లెవెల్ నుంచి కొద్దిగా తగ్గి 3,393.49 డాలర్ల (రూ.2.90 లక్షల) వద్ద సెటిలయ్యింది. గ్లోబల్‌గా, బంగారం ఫ్యూచర్స్ మొదటిసారిగా 3,400 డాలర్ల మార్కును దాటాయి.
నిపుణులు ఏమంటున్నారంటే?
“వాణిజ్య ఉద్రిక్తతలు, రేట్ల తగ్గింపు అంచనాలు, గ్లోబల్‌గా రాజకీయ అనిశ్చితులు, డాలర్ విలువ పడడం వంటి కారణాలతో ఈ ఏడాది బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటివరకు గోల్డ్ రేటు 25 శాతానికి పైగా ఎగసింది. ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించిన రోజు అంటే ఏప్రిల్ 2 W 6 శాతం లాభపడింది” అని కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి తెలిపారు. “ టారిఫ్ వార్‌పై అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్‌కు 3,400 డాలర్లను టచ్ చేశాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇండియాలో అయితే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. పండుగ సీజన్ మొదలైతే గిరాకీ ఇంకా పెరుగుతుంది” అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ వివరించారు. యూఎస్ డాలర్ విలువ తాజాగా మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కైనత్ చైన్‌వాలా అన్నారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్‌ను తొలగిస్తామని అనడంతో సేఫ్ అసెట్లలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ టారిఫ్ పాలసీ ప్రభావం, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై బంగారం ధరలు ఆధారపడతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
10 గ్రాముల బంగారం ధర ఇలా..
ఏడాది సగటు రేటు (రూ.లలో)
2000 4,300
2005 7,000
2010 8,500
2011 26,400
2015 25,000
2020 48,000
2023 60,110
2024 81,500
2025 99,800