- 8 శాతం పెరిగి 136 టన్నులకు చేరింది
న్యూఢిల్లీ: ధరలు పెరుగుతూనే ఉన్నప్పటికీ, మార్చి క్వార్టర్లో బంగారం డిమాండ్ ఎనిమిది శాతం పెరిగి 136 టన్నులకు చేరుకుంది. ఏడాది క్రితం 126 టన్నులు డిమాండ్ నమోదయింది. ఫిబ్రవరిలో ధరలు ఆకస్మికంగా పడిపోవడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. విలువ పరంగా ఇది 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు (గత ఏడాది రూ.63,090 కోట్లు) చేరింది. నగల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు (91.9 టన్నులు) ఉండగా, పెట్టుబడి 19 శాతం పెరిగి 41 టన్నులకు (34 టన్నులు) చేరుకుంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ, పెరుగుతున్న సంపదతో, భారతదేశం బంగారు ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతోందని అన్నారు. ఈ క్వార్టర్ చివరిలో అధిక ధరలు ఉన్నప్పటికీ పెట్టుబడులు పెరిగాయని అన్నారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ -ట్రేడెడ్ ఫండ్స్ వంటి గోల్డ్ బ్యాక్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కొనసాగుతున్నదని ఎనలిస్టులు చెబుతున్నారు.