
- ముగ్గురు అరెస్టు, ప్రధాన నిందితుడి పరారీ
కడెం, వెలుగు: గుప్త నిధుల నుంచి తీసిన బంగారం ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 4.20 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులను ఖానాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఏఎస్పీ రాజేశ్ మీనా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి సిటీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన నరేశ్ తమ గ్రామ సమీపంలో గుప్త నిధులు నుంచి తీసిన అరకిలో బంగారం ఉందని అక్బర్‌ను నమ్మించాడు.
ఆ మొత్తం బంగారం రూ.4.20 లక్షలకు ఇస్తానని మాయమాటలు చెప్పి గ్రామానికి తీసుకువచ్చాడు. అనంతరం మరో నలుగురు స్నేహితులతో కలిసి కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్బర్‌ను కొట్టి కత్తితో బెదిరించారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 4.20 లక్షల నగదును ఎత్తుకొని పారిపోయారు.
దీంతో అక్బర్ కడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణ చేపట్టారు. నిందితులు వంశీ, చింటూ, నితిన్ ను పట్టుకుని రూ. 1.47 లక్షల డబ్బులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మిగతా డబ్బులతో నరేశ్ పరారయ్యడని అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఖానాపూర్ సీఐ అజయ్, కడెం ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ఉన్నారు.