Gold Rates: బంగారం ఆల్ టైమ్ రికార్డు..4నెలల్లో 25 శాతం పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Rates: బంగారం ఆల్ టైమ్  రికార్డు..4నెలల్లో 25 శాతం పెరిగిన గోల్డ్ రేట్స్

2025లోగోల్డ్ రేట్ భారీగా పెరిగాయి. గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 25 శాతం పెరిగి MCX, COMEX రెండింటిలోనూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. COMEX లో వెండి ధర కూడా 15 శాతం పెరిగింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు బంగారం సురక్షితం అని భావించడం కారణంగా ఈ పదునైన ర్యాలీ జరిగిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(MOFSL)  తెలిపింది. 

బంగార ధరలు ఇంకా పెరిగే  ఛాన్స్ ఉందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వార్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లు వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు మద్దతునిస్తూనే ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో MCX లో 10 గ్రాముల బంగారం 91వేలు, 24క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 99వేలుగా ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి,వృద్ధి మందగమనంలో ఉండటంతో బంగారాన్ని తరగని ఆస్తిగా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రస్తుత అస్థిరమైన భౌగోళిక రాజకీయాలు, ఆధిపత్య ధోరణలు కొనసాగుతున్న క్రమంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని మదపర్లు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర బ్యాంకులు నిల్వలను పెంచుకోవడం, ఇన్వెస్టర్లు సేఫ్టీ కోరుకోవడం బంగారం అనుకూలమైన ఆస్తిగా నమ్ముతున్నారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వస్తువులపై సుంకాలను పెంచడంతో బంగారం ధరల్లో కుదుపు వచ్చింది. అయితే కానీ త్వరగా కోలుకోవడం ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని పెంచింది. ట్రంప్ పరిపాలన దూకుడు ట్రేడింగ్ విధానం అమెరికాకు ఉన్న డజన్ల కొద్దీ బిజినెస్ పార్టినర్లను దూరం చేసింది. ముఖ్యంగా చైనాపై 245 శాతం వరకు అధిక సుంకాలు విధించడంతో బీజింగ్ ప్రతీకార చర్యలు చేపట్టింది. దీని వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని, ఆర్థిక మాంద్రం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.