ఇండియన్లకు బంగారమంటే కేవలం వస్తువో, జ్యూయెలరీనో కాదు. సెంటిమెంట్. పిసరంత బంగారమైనా ఇంట్లో ఉండాలన్నది మొత్తం 140 కోట్ల ఇండియన్లకుగల కామన్ సెంటిమెంట్. బంగారానికి ఇంత డిమాండ్ ఉన్నా మన దగ్గర ప్రొడక్షన్ లేదు. డిమాండ్ అండ్ సప్లయిలో గ్యాప్ ఉండడంతో ఏటా మన దేశంలోకి 100 కోట్ల టన్నుల మేర స్మగ్లింగ్ రూపంలో వస్తోంది. బ్యాంకు లాకర్లలోనూ, ఇళ్ళ బీరువాల్లోనూ వేల టన్నుల బంగారం ఉందని, లెక్కకు అందని ఈ పసిడి ప్రతి గ్రాముకి లెక్క తీయించాలని సర్కార్ అనుకున్నట్టు వార్తలు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే, అట్లాంటి ఆలోచన ఏమీ లేదని సర్కారు ప్రతినిధులు చెప్పడంతో స్థిమితపడ్డారు. ఇట్లా ఉలిక్కిపడ్డానికి, స్థిమితపడ్డానికి కారణం ఒకటే….బంగారం అంటే అందరికీ ప్రాణం.
మనకు బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీ దేవే! ఆస్తికులైనా, నాస్తికులైనా బంగారం విషయంలో ఒకే అభిప్రాయంతో ఉంటారు. బంగారం ఉంటే బ్యాంకులో సొమ్ములున్నట్లేనని నమ్ముతారు. కష్టమొచ్చినా, శుభకార్యం జరిగినా అవసరాలకు ఆదుకునేది బంగారమొక్కటే అంటారు. ఇంత బలమైన నమ్మకంగల బంగారం మన దేశంలో ఉత్పత్తి కాదు. వందల ఏళ్లుగా బంగారాన్నిస్తున్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, హట్టి బంగారు గనులు మెయింటెనెన్స్ సమస్యతో ఇప్పుడు మూతపడ్డాయి. దాంతో బంగారాన్ని 100 శాతం ఇంపోర్ట్ చేసుకోక తప్పడం లేదు. మన అవసరాలకు ఏటా 900 టన్నుల బంగారం కావాలని లెక్కలు చెబుతున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ అధికం కావడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చుగా ఉండడంతో తగినంతగా దిగుమతి చేసుకోలేకపోతున్నాం. ఈ లోటు భర్తీ చేయడానికి స్మగ్లర్లు రంగంలో దిగుతుంటారు. బంగారాన్ని కేవలం వస్తువుగానో, జ్యూయెలరీగానో కాకుండా జనాలు సెంటిమెంట్‌తో చూస్తారు. పిసరంత బంగారమైనా ఇంట్లో ఉండాలన్నది మొత్తం 140 కోట్ల ఇండియన్లకుగల ఏకైక సెంటిమెంట్. ఇంట్లో కాలి, చేతివేళ్ల గోరు పడనివ్వరు! ఎందుకంటే, గోరంత బంగారమైనా ఇంట్లో నిల్వ లేకుండా పోతుందన్న భయం!
కేరళలో పోయినేడాది వరదల్లో బాగా నష్టపోయిన తర్వాత… అక్కడి జనాలు బంగారాన్ని బాగా కొనడం మొదలెట్టారు. ఖరీదైన వస్తువులు, ఇల్లు వాకిలి వరదల్లో కొట్టుకుపోయినా తమ ఒంటిపైగల బంగారంతో మళ్లీ నిలదొక్కుకోగలిగారు. ప్రభుత్వం ఇంపోర్డ్ డ్యూటీని పెంచుతూ పోతున్నా బంగారం స్మగ్లింగ్ ఆగకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు గోల్డ్ ఎక్స్‌పర్ట్‌లు. మోడీ సర్కారు డీమానిటైజేషన్ ప్రకటించి, రాత్రికి రాత్రి పెద్ద నోట్ల (రూ.500, 1,000)ను చిత్తుకాగితాలు మార్చేయడం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ 2,000 రూపాయల పెద్ద నోటును రిలీజ్ చేసినా, జనంలో నమ్మకం కుదరలేదని ఎకానమిస్టులు చెబుతున్నారు. బంగారం రూపేణా ఉన్నట్లయితే వైద్యం, విద్య, ఇంట్లో శుభకార్యం వంటి పెద్ద అవపరాలు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో లిక్విడ్ క్యాష్‌కి బదులుగా బంగారాన్ని కొని దాచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
2016లోనే గోల్డ్ మానిటైజేషన్ ఆలోచన
జనం ఆలోచన ఒకలా ఉంటే… సర్కారు ఎత్తుగడలు మరోలా ఉంటున్నాయి. 2016 నవం బర్ ఎనిమిదిన పెద్ద నోట్ల రద్దు జరిగిన రోజుల్లోనే… బ్యాంకు లాకర్లలోకూడా తనిఖీలు జరుగుతాయన్న ప్రచారం బాగా సాగింది. ఎకనమిక్ రిఫార్మ్స్ తర్వాత దేశంలో పెట్టుబడులు పెరగడం, సాఫ్ట్వేర్ బూమ్ రావడం, రియల్ ఎస్టేట్ పుంజుకోవడం తదితర కారణాలతో నియో రిచ్‌లు బాగా పెరిగారు. వీరు కొనుక్కున్న బంగారాన్ని ఎక్కువగా లాకర్లలోనే దాచుకున్నారు. అప్పట్లోనే మోడీ సర్కారు ఇళ్లపైనా, బ్యాంక్ లాకర్లపైనా దాడులు చేసి.. దాచుకున్న బంగారానికి లెక్కలు తీస్తుందని పుకార్లు పుట్టాయి. ఇది సహజంగానే అందరిలోనూ, ముఖ్యంగా మిడిల్ క్లాస్‌లో భయాన్ని పుట్టించింది. ఎందుకంటే, అనాథరైజ్డ్ గోల్డ్ పర్చేజ్ అనేది మన దేశంలో ఎక్కువ. రసీదులు తీసుకుని, పన్నులు కట్టి, బంగారం కొనేవాళ్లు నూటికి 1% మించరని గోల్డ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
2017లో జైట్లీ ప్రతిపాదన
మళ్లీ ఇన్నేళ్లకు జనం గుండెల్లో బంగారంపై బుగులు మొదలైంది. దేశంలో ఉన్న ప్రతి గ్రాము బంగారానికి లెక్క రాబట్టాలని కేంద్రం భావిస్తోంది. గతంలో 2017 బడ్జెట్లోనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. దీనిద్వారా బ్యాంకుల్లో బంగారాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎఫ్డీ మాదిరిగా డిపాజిట్ చేసిన వెంటనే వడ్డీ ఇవ్వకపోవడం, మధ్యలో వెనక్కి తీసుకుంటే జరిమానా కట్టాల్సి రావడం, డిపాజిట్ కాల పరిమితి ముగిశాక క్యాష్ లేదా గోల్డ్ రూపంలో తీసుకునేలా రూల్స్ పెట్టడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ స్కీమ్‌ని ఒక రకంగా స్త్రీ ధనంపై ప్రభుత్వం పెత్తనం చేయడంగా జనం భావించారు. మన దేశంలోని బంగారంలో 70 శాతం ఆభరణాల రూపంలోనే ఉంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. బంగారం ఎక్కువగా ఆడవాళ్ల దగ్గరే ఉంటుందని, మరీ పీకల మీదకు వస్తే తప్ప తాకట్టు లేదా అమ్మడానికి ఇష్టపడరని ఆయా సర్వేల్లో తేలింది. మహిళలకు పుట్టింటి నుంచి, అత్తారింటి నుంచి కూడా బంగారం జమవుతుంది. వీటికి ఎలాంటి లెక్కలూ ఉండవు. ఎవరి దగ్గరా 60 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని అప్పట్లో ఎకనమిస్టులు ప్రపోజ్ చేశారు. అంతకుమించి ఉన్నట్లయితే తగిన లెక్క చూపించి, పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే, ఇవన్నీ ప్రపోజల్స్ రూపంలోనే ఉన్నాయి. మొత్తం మీద అదనపు బంగారాన్ని వినియోగంలోకి తీసుకు రావడానికి ఎప్పటికప్పుడు కేంద్రం ఆలోచనలు చేస్తూనే ఉంది.
పుత్తడి లేడి ‑పసిడి గని
ఇండియాలో బంగారు గని అనగానే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తొస్తాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ఈ గనులు వ్యాపించాయి. ఇవి ఏర్పడడానికి రామాయణంలోని ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడంకోసం మారీచుడిని బంగారు జింక రూపంలో పంపుతాడు. సీత ఆ జింకకోసం అడిగితే, రాముడు పట్టుకోవడంకోసం వెళ్లి, చివరకు బాణం వేస్తాడు. మారీచుడు బాణం దెబ్బలు తిని పారిపోతూ చనిపోతాడు. ఆ బంగారు జింక రక్తం పడి ప్రాంతమంతా బంగారు గనిగా మారిపోయిందని స్థానికుల నమ్మకం. ఇక్కడ క్రీస్తు శకం ఒకటో శతాబ్ధం నుంచే బంగారం తవ్వకాలు జరిగినట్లు చెబుతారు. గుప్తులు, చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ హయాంలోనూ వెలికితీత సాగినట్లు ఆధారాలు లభించాయి.
ఆస్తిలో భాగమే…
ఆస్తి అంటే ఇళ్లు, పొలాలే కాదు బంగారం కూడా అని నమ్ముతాం మనమంతా. వందల ఏళ్లుగా మనదేశానికి బంగారానికి విడదీయరానంత బంధం ఏర్పడిం ది. చాలా దేశాల్లో బంగారం అంటే బిస్కె ట్స్ , బార్సే అనుకుం టారు. మనదేశంలో మాత్రం బంగారం అంటే నగలే. పాపాయి బారసాల దగ్గర నుం చి పెళ్లయ్యే వరకు జరిగే అన్ని శుభకార్యాల్లో బంగారం కానుకలు లేకుం డా ఉండవు.
నమ్ముకుంటే నష్టపోరు
బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు పెద్దలు. సహజంగా బంగారాన్ని అమ్మడానికి మనదేశంలో ఎవరూ ఇష్టపడరు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మడానికి చూస్తారు. బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి లోను తెచ్చుకోవచ్చు. అమ్ముకున్నా డబ్బులు వస్తాయి. అదే బంగారం గనుక ఇంట్లో ఉంటే అత్యవసర సమయాల్లో తప్పకుండా ఆదుకుంటుంది. భారీ ఖర్చులు వచ్చినప్పుడు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునే సత్తా బంగారానికే ఉందంటారు పెద్దలు. అందుకే కేవలం ఆడవాళ్లే కాదు… మగవాళ్లు కూడా బంగారం కొనడం కరెక్టేనని నమ్ముతున్నారు.
స్వర్ణమంటే సెంటిమెంట్
మనవాళ్లకు మొదటి నుంచి బంగారం అంటే ఆసక్తే. ఆడవారైతే శుభకార్యాల్లో బంగారు ఆభరణాలు ధరించడాన్ని ఇష్టపడతారు. పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో ఎవరు ఎన్ని నగలు ధరిస్తే వాళ్ల దగ్గర ఆ రేంజ్ లో డబ్బులున్నట్లు జనం అంచనా వేస్తారు. ఏ ఏడాదైనా పంటలు బాగా పండితే బంగారం కొనడానికి రైతులు ఉత్సాహం చూపిస్తుంటారు. విదేశాల్లో బంగారం ఒక కమాడిటీ అయితే మనదేశంలో మాత్రం బంగారం ఓ సెంటిమెంట్‌తో కూడిన అసెట్. గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం నూటికి నూరు శాతం సురక్షితం అని మనవాళ్లు నమ్ముతారు. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాదు, నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. పేదవారైనా భవిష్యత్ అవసరాలకు బంగారాన్ని దాచుకుంటారు.
గోల్డ్ మెడల్ చైనాదే
బంగారు నిల్వల్లో చాలా కాలం పాటు దక్షిణాఫ్రికానే నెంబర్ ఒన్ గా ఉండేది. ఈ విషయంలో 2008లో దక్షిణాఫ్రికాను బీట్ చేసింది చైనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగంలో పదో వంతు చైనా బంగారమే. దక్షిణాఫ్రికా మైన్స్ లో నిల్వలు తరిగిపోయిన సమయంలోనే చైనాలో గోల్డ్ ప్రొడక్షన్ పెరిగింది. పెద్ద ఎత్తున బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ఉన్నాయి. వీటిలో చైనా మినహా మిగతా ఏడు దేశాల్లో గోల్డ్ ప్రొడక్షన్ తగ్గింది.
రేటు ఎవరు నిర్ణయిస్తారు ?
మన మార్కెట్లో బంగారం రేటు ఇంటర్నేషన్ మార్కెట్ రేట్లను బట్టి నిర్ణయిస్తారు. రేట్ల నిర్ణయంలో ‘ఇండియన్ బులియన్ జ్యూయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థలో బడా గోల్డ్ డీలర్లు సభ్యులుగా ఉంటారు. ‘డిమాండ్ – సప్లయ్’ ఆధారంగా రేటును వీళ్లు ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. మన బంగారంలో 90 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ఇలా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకున్నప్పుడు డ్యూటీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సుంకాలు తరచూ మారుతుంటాయి. ఇవి మారినప్పుడల్లా బంగారం రేట్లు కూడా మారుతుంటాయి. ఇలా దిగుమతి చేసుకున్న బంగారం మొదట బ్యాంకులకు చేరుతుంది. బ్యాంకుల నుంచి బులియన్ డీలర్లకు చేరుతుంది. దీని కోసం గోల్డ్ డీలర్ల నుంచి బ్యాంకులు కొంత ఫీజు వసూలు చేస్తుంటాయి.
కంట్రోల్ లేకపోతే కష్టం!
గోల్డ్‌పై నియంత్రణ ఎందుకని అడుగుతుంటారు. మన దేశంలో బంగారాన్ని చాలా తక్కువ సమయాల్లోమాత్రమే బయటకు తీస్తారు. ఒకసారి కొన్నట్లయితే దానిని తరతరాలుగా అదే కుటుంబంలో ఆడపిల్లలకు వారసత్వంగా చేతులు మారుతుంది. అదెప్పటికీ ఓపెన్ మార్కెట్‌కి రాదు. అదే గనుక పెట్టుబడులు, షేర్లు, బాండ్ల రూపంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుంది. ఒక్కసారి గనుక కంట్రోల్ ఎత్తివేస్తే… ఫారిన్ ఎక్చేంజ్ మొత్తం బంగారం కొనుగోలుకి వెళ్లిపోతుంది. ఎరువులు, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్వంటి అనేక రంగాల్లో దిగుమతులు సాధ్యపడవు. ఈ కారణాలతోనే గోల్డ్ కంట్రోల్‌ని కొనసాగిస్తూనే… దేశంలో బయటకు రాని బంగారం లెక్కలు తీయించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
‘ఒన్ గ్రామ్ గోల్డ్’ పై ఆసక్తి
మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడంతో ‘ఒన్ గ్రామ్ గోల్డ్’ పై ప్రజలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఒకప్పుడు రోల్డ్ గోల్డ్ అనే వాటినే ఇప్పుడు ఒన్ గ్రామ్ గోల్డ్ అంటున్నారు. కొన్నేళ్ల కిందట ఇలాంటి ఆభరణాలు వేసుకోవడాన్ని చిన్నతనంగా భావించేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. అచ్చమైన బంగారు ఆభరణాల స్థానంలో ఒన్ గ్రామ్ గోల్డ్ సందడి చేస్తోంది. రకరకాల డిజైన్లలో ఈ ఆభరణాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. డబ్బులున్న వాళ్లు కూడా ఇలాంటి ఆభరణాలు వేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు.
స్మగ్లింగ్ ఆగట్లేదు
ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా మాత్రమే. ఈ మధ్య బంగారం దిగుమతులు బాగా తగ్గాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడచిన మూడేళ్ల నుంచి బంగారం ఇంపోర్ట్‌పై ప్రభుత్వం ఆంక్షలు పెంచడంవల్ల 68 శాతం మేర దిగుమతులు తగ్గాయి. గోల్డ్ స్మగ్లింగ్‌ని అరికట్టడంకోసం ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతూ పోతున్నా ఫలితం ఉండడం లేదు. డిమాండ్ అండ్ సప్లయి కేటగిరీలో గ్యాప్ ఉండడంతో రోజూ ఏదో ఒక ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి భూమార్గంద్వారానూ, మలేసియా, థాయ్‌లాండ్‌ల నుంచి విమానాలు, నౌకలద్వారానూ ఇండియాకి బంగారాన్ని స్లగ్లింగ్ చేస్తుంటారు. థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో బంగారంపై జనాలకు మోజు తక్కువ. ఆయా దేశాల్లో డొమెస్టిక్ డిమాండ్ లేకపోవడంవల్ల ఇండియాకి తరలిస్తుంటారు.
పసిడి తాకట్టు నుంచి పుట్టిన రిఫార్మ్స్
దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం ఇండియాకి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైంది. విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులకు వడ్డీల్ని చెల్లించలేని పరిస్థితి. మరో పక్క దిగుమతులు పెరిగిపోయాయి. వాటికి చెల్లింపులు చేయాలంటే, మన దగ్గరున్న ఫారిన్ ఎక్చేంజి నిల్వలు అడుగంటిపోయాయి. కేవలం మూడు వారాలకు సరిపడే ఫారిన్ ఎక్చేంజి మాత్రమే ఉంది. సద్దాం హుసేన్ కువాయిట్‌పై దాడి చేయడంతో గల్ఫ్‌లో టెన్షన్వల్ల పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. వీటన్నిటినీ తట్టుకోవాలంటే వందలాది కోట్ల డాలర్లు అవసరమయ్యాయి. ఇలాంటి సంక్షోభంలో ఐఎంఎఫ్‌కి హామీ చూపడంకోసం అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం ఖజానాలోని రిజర్వ్ బంగారాన్ని బయటకు తీసింది. 67 టన్నుల బంగారం కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టి, 202 కోట్ల డాలర్లు అప్పు తెచ్చుకుంది. మరో 47 టన్నుల్ని ఇంగ్లాండ్ బ్యాంకులోనూ, 20 టన్నుల్ని స్విట్జర్లాండ్ యూనియన్ బ్యాంకులోనూ కుదువపెట్టి 60 కోట్ల డాలర్లు రుణం పుట్టించింది. బంగారాన్ని తాకట్టు పెట్టడమనేది ఇండియన్లకు చాలా సెంటిమెంట్ వ్యవహారం. దేశమంతా గగ్గోలు పెట్టింది. ఈ పరిణామాలతోనే పి.వి.నరసింహారావులో ఎకనమిక్ రిఫార్మ్స్ ఆలోచన తలెత్తింది. ఆయన తెచ్చిన రిఫార్మ్స్, లిబరలైజేషన్ పాలసీవల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి.