
భారతదేశంలో డబ్బు లేనిది ఎవరి దగ్గర అండీ.. సెల్ ఫోన్లు వాడుతున్నారు.. బట్టలు కొంటున్నారు.. తీర్థయాత్రలు చేస్తున్నారు.. బైక్స్ కొంటున్నారు.. కార్లు కొంటున్నారు.. రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయి.. రోడ్లు రద్దీగా ఉన్నాయి.. ఏ షాపు చూసినా జనం కిటకిట.. జొమాటో, స్విగ్గీలు ఫుల్ బిజీగా ఉన్నాయి.. డబ్బు ఎవరి దగ్గర లేదండీ.. లక్షలు పెట్టి సెల్ ఫోన్లు కొంటున్నారు.. వేల రూపాయల రీఛార్జీలు చేస్తున్నారు.. పెళ్లిళ్లు, పేరంటాలు ఘనంగా చేస్తున్నారు.. విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్నారు.. జనం దగ్గర డబ్బులు ఎందుకు లేవండీ.. ఇలాంటి మాటలు ఈ మధ్య సమాజంలో తరచుగా వినిపిస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల దాకా ఇదే చర్చ. దేశంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆర్బీఐ డేటానే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఇవన్నీ బయటకు వినిపించే మాటలేనని.. లోలోపల అసలు విషయం వేరే ఉంది అనేది లెక్కలు చెబుతున్న సత్యం. పైకి ఢాంబికం ప్రదర్శిస్తున్నా.. అప్పులు చేసి మరీ చాలా మంది హోదా చూపించుకుంటున్నారనేది పచ్చి నిజమని ఆర్బీఐ డేటాతో తేలిపోయింది. దేశంలో చాలామంది ప్రజల దగ్గర డబ్బులు లేక బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బును రోజువారీ ఖర్చులకు, విలాసాలకు వాడుకుంటున్నారు. ఆ డబ్బుతోనే సినిమాలూ, షాపింగులు. నేతి బీరకాయలో నెయ్యి ఎలాగైతే ఉండదో డాబు ప్రదర్శించే జనమంతా డబ్బున్నోళ్లు కాదనేది ఒప్పుకోక తప్పని నిజం.
भारत की अर्थव्यवस्था मोदी-निर्मित संकट में गहराई से फंसी हुई है। याद कीजिए कि 2024 तक, आर्थिक स्थिरता के चलते सिर्फ 5 वर्षों में गोल्ड लोन में 300% की वृद्धि हुई थी, जो पहली बार 1 लाख करोड़ रुपये के आंकड़े को पार कर गया।
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 4, 2025
भारत की महिलाओं के लिए बुरी खबरें लगातार बढ़ रही हैं।… https://t.co/fH9FktLkhT pic.twitter.com/zKHT2BJb7R
2025 ఫిబ్రవరిలో.. ఆర్బీఐ వెల్లడించిన సెక్టోరల్ డిప్లాయిమెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 2024 నాటికి మన దేశంలో గోల్డ్ లోన్లు 71 శాతానికి పెరిగాయి. పర్సనల్ లోన్స్ సెగ్మెంట్లో గోల్డ్ లోన్ల శాతం పైపైకి ఎగబాకింది. డిసెంబర్ 27, 2024 నాటికి బ్యాంకుల్లో దేశ ప్రజలు తీసుకున్న గోల్డ్ లోన్ల విలువ అక్షరాలా.. లక్షా 72 వేల కోట్ల రూపాయలు. 2023 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్ల శాతం 68.3 శాతం ఉండగా 2024 నాటికి 71 శాతానికి గోల్డ్ లోన్లు పెరిగాయి.
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రాము 8 వేలకు పైనే పలుకుతోంది. కస్టమర్లు తమ బంగారం బ్యాంకులో తాకట్టు పెడితే పెద్ద మొత్తంలో లోన్లు పొందొచ్చనే ఆలోచన చేస్తున్నారని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు.. నిత్యావసరాల ధరల పెరగడం, ప్రజలు నిత్యం వినియోగించే పలు వస్తువులపై ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పన్నులు విధించడం, విలాస జీవితానికి కొందరు ప్రజలు అలవాటుపడటం, ఉన్నంతలో బతకాలనే ఆలోచన నుంచి అప్పు చేసైనా గొప్పగా బతకాలనే ఆలోచన ప్రజల్లో పెరగడం.. ఇవే ఇండియాలో గోల్డ్ లోన్లు పెరగడానికి ప్రధాన కారణాలుగా అనలిస్టులు చెబుతున్నారు.
Also Read:-మధ్య తరగతి కొనలేనంత పెరిగిన.. తులం బంగారం ధర.. హైదరాబాద్లో ఎంతంటే..
ఒక్క గోల్డ్ లోన్లు మాత్రమే కాదు క్రెడిట్ కార్డులు తీసుకుని అవసరాలకు వాడుకుంటూ.. అవి కట్టడానికి తిప్పలు పడుతున్న వాళ్ల సంఖ్య కూడా దేశంలో విపరీతంగా పెరిగింది. దేశంలో క్రెడిట్ కార్డు బాకీలు 15.6 శాతం పెరిగాయి. దేశ ప్రజలు క్రెడిట్ కార్డులను వినియోగించి 2.9 లక్షల కోట్ల బాకీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. గోల్డ్ లోన్లు విపరీతంగా పెరగడానికి కారణం ‘మోదీ సృష్టించిన సంక్షోభం’ అని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో విమర్శించారు. దేశంలో ఐదేళ్లలో గోల్డ్ లోన్లు 300 శాతం పెరిగాయని.. బంగారం తాకట్టు పెట్టి చేసిన బాకీలు లక్ష కోట్లకు చేరడం దేశ చరిత్రలోనే తొలిసారి అని జైరాం రమేశ్ పోస్ట్ చేశారు. ఈ పరిణామం.. దేశ మహిళలకు చేదు వార్తేనని చెప్పక తప్పదన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని.. ఈ తప్పులకు భారతీయ మహిళలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జైరాం రమేశ్ మండిపడ్డారు.