
- గతంలో బ్యాంక్‌లో చొరబడి రూ. 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
- డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్న బ్యాంక్ సిబ్బంది
- ప్రస్తుత రేట్ కట్టివ్వాలని బాధితుల ఆందోళన
రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐకి శుక్రవారం పలువురు బంగారం తాకట్టుదారులు తాళం వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... ఈ బ్యాంక్‌లో గతంలో దొంగలు పడి 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. ఇందులో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 2.520 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. దీంతో తమ బంగారం తమకు ఇవ్వాలని తాకట్టు పెట్టిన వారు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తులం బంగారానికి రూ. 77,710 చొప్పున ఇస్తామని బ్యాంక్ సిబ్బంది చెబుతుండడంతో.. ఇందుకు తాకట్టుదారులు ఒప్పుకోవడం లేదు.
రేటు విషయం తేల్చేందుకు శుక్రవారం బ్యాంక్‌కు ఉన్నతాధికారులు వస్తున్నారని తెలియడంతో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు బ్యాంక్ వద్దకు వచ్చారు. చివరకు ఆఫీసర్లు రాడం లేదని చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ సిబ్బందిని బయటకు పంపి బ్యాంక్‌కు తాళం వేశారు. అనంతరం బ్యాంక్ ఎదుట బైఠాయించి ఉన్నతాధికారులు వచ్చే వరకు తాళం తీసేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని బాధితులతో మాట్లాడారు. మరికొన్ని రోజుల్లో ఉన్నతాధికారులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు.