రికార్డు బద్ధలు కొట్టిన బంగారం ధరలు.. తులం రేటు ఇంత పెరగడం ఇదే ఫస్ట్ టైం !

రికార్డు బద్ధలు కొట్టిన బంగారం ధరలు.. తులం రేటు ఇంత పెరగడం ఇదే ఫస్ట్ టైం !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి 10, 2025) బంగారం ధరలు రికార్డు సృష్టించాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై సోమవారం 2,430 రూపాయలు పెరిగింది. దీంతో.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88,080 రూపాయలకు చేరి పసిడి ప్రియులను కలవరపాటుకు గురిచేసింది. అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య విధానాలు, కీలక నిర్ణయాలు భారత్లో బంగారం ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం.

2024లో పెరిగినంతలా కాకపోయినా 2025లో  బంగారం ధరలు మోస్తరుగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డొమెస్టిక్​ మార్కెట్లో ధరలు రూ.85 వేల వరకు వెళ్తాయని, డిమాండ్ మరీ ఎక్కువైతే రూ.90 వేల మార్కుకు చేరుకుంటాయని చెప్పారు. వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు దూసుకెళ్లవచ్చని వివరించారు. నిజానికి.. బంగారం ధరలు చుక్కలు చూపుతున్నాయి. 2025 ప్రారంభంలో జనవరి 1న 24 క్యారెట్ల బంగారం రూ.78వేలు, 22 క్యారెట్ల బంగారం రూ.71,500 పలికింది. నెల వ్యవధిలోనే బంగారం ధర రూ.8వేలకు పైగా పెరగడం గమనార్హం. 

ALSO READ | హైదరాబాద్లో ఆల్ టైం హైకి బంగారం ధరలు.. దూసుకుపోయిన తులం ధర..

అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూఎస్ డాలర్ బలపడ్తున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడ్తుండడం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. మున్ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు అనూహ్యంగా పెరగడంతో సామాన్యులు తిప్పలు పడ్తున్నారు. నిజానికి జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవంటే అతిశయోక్తి కాదు. ఆయా కుటుంబాలు తాహతును బట్టి పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ  బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన గోల్డ్​ రేట్లతో వధువుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు.