
న్యూఢిల్లీ: బంగారం ధరలు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. పసిడి ధర బుధవారం ఢిల్లీలో రూ.1,800 పెరిగింది. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ కోసం వ్యాపారులు విపరీతంగా కొనడమే ఇందుకు కారణం. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి రేటు రూ.1,800 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,01,600లకు చేరుకుంది. సోమవారం ముగింపు స్థాయి 10 గ్రాములకు రూ.99,800 ఉంది. మంగళవారం స్థానిక మార్కెట్లలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.2,800 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,02,100కు చేరుకుంది. గత సెషన్‌లో ఇది 10 గ్రాములకు రూ.99,300 వద్ద స్థిరపడింది. గత డిసెంబర్ నుంచి ధర రూ.22,650 (దాదాపు 29 శాతం) పెరిగింది. వెండి ధరలు మాత్రం మారలేదు. కిలోకు రూ.98,500 వద్ద స్థిరంగా ఉన్నాయి. యూఎస్ డాలర్ బలహీనత, యూఎస్–-చైనా వాణిజ్య యుద్ధం చుట్టూ ఉన్న అనిశ్చితులు బంగారం ధరను రికార్డు స్థాయికి నెట్టాయని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా అన్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం జూన్ కాంట్రాక్ట్ ధర10 గ్రాములకు రూ. 2,079 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 99,358కి చేరుకుంది. తదనంతరం వెనక్కి తగ్గి రూ. 98,450 వద్ద ట్రేడవుతోంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర 75.55 డాలర్లు పెరిగి ఔన్సుకు (28.3 గ్రాములు)3,499.92 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 83.76 డాలర్లు పెరిగి తొలిసారిగా 3,500 డాలర్ల సైకలాజికల్ మార్కును అధిగమించింది.