Gold Price: హమ్మయ్య.. బంగారం ధర మళ్లీ భారీగా తగ్గిందిగా.. ఇలానే తగ్గొచ్చుగా..!

Gold Price: హమ్మయ్య.. బంగారం ధర మళ్లీ భారీగా తగ్గిందిగా.. ఇలానే తగ్గొచ్చుగా..!

అక్టోబర్లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నవంబర్ వచ్చేసరికి క్రమంగా తగ్గుతున్నాయి. ఒకరోజు పెరిగినా మరో రోజు తగ్గుతూ కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం(నవంబర్ 10,2024) 72,750 రూపాయలు ఉండగా సోమవారానికి రూ.72,200కి పసిడి ధర పడిపోయింది.

ఒక్కరోజులో 10 గ్రాములపై 550 రూపాయల ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం 79,360 రూపాయలు ఉంది. సోమవారం అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,760 రూపాయలుగా ఉంది. 10 గ్రాములపై 600 రూపాయలు తగ్గి పెళ్లిళ్ల సీజన్లో కాస్తంత ఊరటనిచ్చింది.

నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. 6 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. పెళ్లిళ్ల సమయంలో జరిగే బిజినెస్లో బంగారందే అగ్ర స్థానం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లికి నగానట్రా కొనకుండా ఎవరుంటారు చెప్పండి. ఇలాంటి సమయంలో బంగారం ధర తగ్గడం శుభ పరిణామమనే చెప్పాలి.

ALSO READ | 80 వేల డాలర్లపైన బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ ధర

ధన త్రయోదశి సమయంలో కూడా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. ప్రజలు ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆరోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే  సిరిసంపదలు వస్తాయని నమ్మకం. కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొనేందుకు ఆసక్తి చూపుతారు. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు  ప్రత్యేక ఆఫర్లు పెడుతుంటారు.

ఈసారి కూడా సెంటిమెంట్ను క్యాష్  చేసుకునేందుకు ప్రత్యేక  ఆఫర్లు, డిస్కౌంట్లు  పెట్టారు. కొన్ని దుకాణాలు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలుకు అవకాశం కల్పించాయి.  అయితే, బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండడంతో  కొనుగోలుదారులను ఆకర్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జనం మొగ్గుచూపలేదు. ఈసారి అమ్మకాలు 30 శాతం పడిపోయాయని వ్యాపారులు చెప్పారు.

అక్టోబర్లో పరిస్థితి ఇలా ఉండగా.. నవంబర్లో మాత్రం ఇందుకు కొంత భిన్నంగా ఉంది. గత నెలతో పోల్చితే నవంబర్లో బంగారం ధరలు కాస్తంత తగ్గుముఖం పడుతుండటం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. 10 గ్రాముల ధర 81 వేలకు ఎగబాకిన పరిస్థితి నుంచి 78,760 రూపాయలకు తగ్గడంతో పసిడి ప్రియులు మరింత తగ్గితే బాగుండని భావిస్తున్నారు.