న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు గురువారం మరోసారి దిగొచ్చాయి. వరుసగా నాలుగో సెషన్‌లోనూ తగ్గాయి. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.700 తగ్గి రూ.76,650కి చేరుకుంది. బుధవారం 10 గ్రాముల ధర రూ.77,350 వద్ద ముగిసింది. వెండి కూడా కిలోకు రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరుకుంది.
క్రితం ముగింపులో కిలోకు రూ.92,500గా ఉంది. ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో, డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టు ధర రూ. 804 పడిపోయి 10 గ్రాములకు రూ.73,678 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,182 క్షీణించి 10 గ్రాములు రూ.73,300లకు చేరుకుంది. డాలర్ విలువ పెరగడంతోపాటు ఎంసీఎక్స్ ధర రూ. 73,500కి చేరుకోవడంతో బంగారం డీలా పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ ఎగ్జిక్యూటివ్ జతిన్ త్రివేది తెలిపారు. డిసెంబర్ డెలివరీ కోసం వెండి కాంట్రాక్టులు రూ.2,067 క్షీణించి కిలో రూ.87,130కి చేరాయి. గ్లోబల్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 29.10 డాలర్లు పడిపోయింది.