
న్యూఢిల్లీ: రికార్డ్ గరిష్టాలకు చేరిన బంగారం ధరలు శుక్రవారం దిగొచ్చాయి. 10 గ్రాముల గోల్డ్ రేటు ఇండియాలో స్పాట్ మార్కెట్‌లో రూ.లక్ష మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ప్రాఫిట్ బుకింగ్ వలన ఎంసీఎక్స్‌లో జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రేటు శుక్రవారం రూ.839 తగ్గి రూ.95,073 కి పడింది. యూఎస్–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతుండడమే కారణం.
స్పాట్ మార్కెట్ చూస్తే, హైదరాబాద్‌లో 24-క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,240, 22-క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 90,050గా ఉంది. వెండి ధర కేజీకి రూ.1,10,900 పలుకుతోంది. కాగా, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, యూఎస్ మాంద్యం భయాల మధ్య గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ రేటు మంగళవారం రూ. 1 లక్ష మార్కును కూడా దాటింది.
స్వల్ప కాలంలో బంగారం ధరలు తగ్గొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. పెద్ద సంస్థలు లాభాల స్వీకరణకు మొగ్గు చూపొచ్చని అన్నారు. లాంగ్ టెర్మ్‌లో మాత్రం ధరలు పెరుగుతాయని, రేట్లు తగ్గితే కొనుక్కునేందుకు మంచి అవకాశం అని అన్నారు. కాగా, భారతదేశంలో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారక రేట్ల హెచ్చుతగ్గులు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి.