బంగారం 880 తగ్గింది.. మూడ్రోజులుగా స్వల్పంగా దిగొస్తున్న రేట్లు

బంగారం 880 తగ్గింది.. మూడ్రోజులుగా స్వల్పంగా దిగొస్తున్న రేట్లు
  • ఈ నెల 20న రూ. 90,660.. ఇప్పుడు రూ. 89,780

హైదరాబాద్, వెలుగు: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ రూ. 90 వేలు దాటిన గోల్డ్ రేటు గత మూడు రోజుల్లో రూ.880 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డ్ స్థాయిలో రూ. 90,660కి పెరగగా.. తాజాగా ఆదివారం నాటికి రూ. 89,780కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్​ ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి మరింతగా పెరుగుతాయని భావించారు. కానీ నెమ్మదిగా బంగారం, వెండి ధరలు దిగొస్తుండటంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభిస్తున్నది. 

అయితే, అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ మార్కెట్లోకి తరలిస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్ సప్లై మధ్య తేడాలు కూడా ధరలు స్వల్పంగా తగ్గడానికి ఒక  కారణమని అంటున్నారు. 

ఏడాదికాలంగా పెరుగుతూ.. తగ్గుతూ..

బంగారం ధర గడచిన ఏడాది కాలంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధర ఎక్కువగా పెరిగింది. హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో 24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.86,840కి, 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.79,600కు చేరింది. అప్పటి నుంచి గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై సుంకాలు  పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. 

దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడంతో బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభమైంది.  ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లు రికవరీ బాట పట్టడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

మూడు రోజుల నుంచి తగ్గుముఖం 

బంగారం ధరలు శుక్రవారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 220 మేరకు పెరిగి, రూ. 90,660కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 83,100 అయింది. అయితే, శుక్రవారం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేట్ ముందు రోజు కంటే రూ. 440 మేరకు తగ్గి రూ. 90,220కి దిగొచ్చింది. 

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 400 తగ్గి రూ. 82,700కు చేరింది. శనివారం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 89,780కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,300కు తగ్గాయి. ఆదివారం కూడా దాదాపుగా ముందు రోజు ధరలే ఉన్నాయి. మొత్తంగా శుక్రవారం నుంచి ఆదివారం నాటికి మూడు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 880 మేరకు తగ్గినట్టయింది.