
- ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.98,100 కి
- హైదరాబాద్‌లో రూ.96,150
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.18,710 పైకి
- వెండి రేట్లకూ రెక్కలు
- యూఎస్, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదరడమే కారణం
- గ్లోబల్‌గా గోల్డ్‌కు ఫుల్ డిమాండ్.. రేట్లు ఇప్పటిలో తగ్గే అవకాశం తక్కువ
న్యూఢిల్లీ: బంగారం సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంది. పది గ్రాముల రేటు బుధవారం రూ.లక్షకు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,650 పెరిగి జీవిత కాల గరిష్టమైన రూ. 98,100 ని టచ్ చేసింది. యూఎస్, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైన అసెట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా బంగారం, వెండి వంటి అసెట్స్‌కు డిమాండ్ ఎక్కువైంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ డేటా ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ విలువ మంగళవారం రూ. 96,450 వద్ద కదిలింది. ఈ నెల 11న గోల్డ్ ధర ఒక్క రోజే 10 గ్రాములకు రూ. 6,250 పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న రూ. 79,390 పలికిన గోల్డ్ రేటు, ఇప్పటివరకు రూ. 18,710 (23.56 శాతం) పెరిగింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా బుధవారం రూ. 1,650 పెరిగి గత ముగింపు ధర రూ. 96,000 నుంచి కొత్త గరిష్ఠ స్థాయి అయిన రూ. 97,650కి ఎగిసింది.
వెండి ధరలూ భారీగా పెరుగుతున్నాయి. వెండి కిలోకి రూ. 1,900 పెరిగి రూ. 99,400కు చేరుకుంది. దీని రేటు మంగళవారం రూ. 97,500 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం రేటు బుధవారం రూ. 990 పెరిగి రూ.96,170 కి చేరుకోగా, 99.5 శాతం స్వచ్చత కలిగిన బంగారం రేటు రూ.950 పెరిగి రూ. 88,150ని టచ్ చేసింది. వెండి కేజీకి రూ.1,10,000 పలుకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఫ్యూచర్స్(జూన్ డెలివరీ,10 గ్రాములు ) రూ. 1,984 ( 2.12 శాతం) పెరిగి రూ. 95,435 వద్ద రికార్డు గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి.
ఇప్పటిలో ధరలు తగ్గవు
“బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో రూ. 95,000 స్థాయిని తాకగా, కామెక్స్‌లో గోల్డ్ రేటు ఔన్స్‌కు 3,300 డాలర్ల (రూ.2.83 లక్షల) కు పెరిగింది. సేఫ్ అసెట్స్‌కు భారీ డిమాండ్ ఉందనే విషయం అర్థమవుతోంది” అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.
గ్లోబల్‌గా రాజకీయ అనిశ్చితి నెలకొనడం, యూఎస్, చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతుండడంతో గోల్డ్ ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు. పరిస్థితులు సద్దుమణిగేంత వరకు బంగారం ధరలు తగ్గవని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌గా చూస్తే స్పాట్ బంగారం ఔన్స్‌కు 3,318 డాలర్ల వద్ద ఆల్ టైమ్‌రికార్డును నమోదు చేసింది. “యూఎస్ ప్రభుత్వం చైనాపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచింది. వాణిజ్య యుద్ధ ఆందోళనలు మరింత పెరిగాయి” అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ -కైనత్ చైన్ వాలా తెలిపారు.
అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా ప్రకారం, యూఎస్ డాలర్ ఇండెక్స్ 100 స్థాయి కంటే తక్కువకు పడిపోయింది. గత మూడేళ్లలో ఇదే తక్కువ. గోల్డ్ రేట్లు భారీగా పెరగడానికి డాలర్ విలువ పడడం కూడా ఒక కారణం. అంటే ఇన్వెస్టర్లు డాలర్‌లో కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉంది. రేట్లు తగ్గితే బంగారం ధరలు మరింత పెరగొచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లకూ ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. వీటిలోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. మరోవైపు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. గోల్డ్ డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం. యూఎస్ రిటైల్ సేల్స్ డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వంటి మాక్రో ఎకనామిక్ డేటా, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను స్వల్ప కాలంలో ఇవి ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు తెలిపారు.