- మొదటి 6 నెలల్లో 14 శాతం పెరిగిన బంగారం ధర
- గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా ఇన్‌ఫ్లోస్
- రికార్డ్ స్థాయిల్లో బంగారం ధరలు
న్యూఢిల్లీ: షేర్ మార్కెట్ కంటే గోల్డ్ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో 14 శాతం పెరగగా, ఇదే టైమ్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్ 12 శాతం పెరిగింది. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు 13 శాతం లాభపడి ఔన్స్‌కు 2,380 డాలర్లకు చేరుకున్నాయి. చాలా కాలం నుంచి వడ్డీ రేట్లు గరిష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ గోల్డ్‌కు డిమాండ్ తగ్గలేదని చెప్పాలి.
బాండ్లు, సెక్యూరిటీలతో ఎక్కువ వడ్డీ వచ్చినప్పటికీ గోల్డ్‌లో డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడంతో రిస్క్‌కు దూరంగా ఉండే ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేశారు. దీంతో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో గోల్డ్‌ను కొనడం, జియో పొలిటికల్ టెన్షన్లు బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లోకి కిందటి నెలలో 1.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం, వరుసగా రెండో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఫండ్స్ ఇన్‌ఫ్లోస్ పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆసియాలోని గోల్డ్ ఫండ్స్‌లోకి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరిగాయనే విషయం దీనిని బట్టి తెలుస్తోంది. మరోవైపు నార్త్ అమెరికా, యూరప్‌లోని గోల్డ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. అయినప్పటికీ గత రెండు నెలల్లో గ్లోబల్‌గా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి 6.7 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి.
బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
గోల్డ్ రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్ టెన్షన్లు, ఇజ్రాయిల్–హమాస్ యుద్ధం వంటి జియో పొలిటికల్ టెన్షన్లతో పాటు యూఎస్, చైనా మధ్య ముదురుతున్న గొడవ కూడా గోల్డ్ ధరలకు సపోర్ట్‌గా ఉన్నాయి. మరోవైపు వడ్డీ రేట్లను తగ్గించడానికి యూఎస్ ఫెడ్ రెడీ అవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే గోల్డ్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. వడ్డీ రేట్లు తగ్గించడం వలన ఇతర అసెట్స్ ఇచ్చే రిటర్న్స్ తగ్గుతాయి. ఫలితంగా గోల్డ్, సిల్వర్ వంటి విలువైన మెటల్స్ ఆకర్షణీయంగా మారుతాయి.
ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పుడు తగ్గిస్తుందనే అంశంపై క్లారిటీ లేనప్పటికీ, త్వరలోనే రేట్ల కోత ఉండొచ్చని అంచనాలు పెరిగాయి. ఐఎన్‌జీ రిపోర్ట్ ప్రకారం, యూఎస్ ఆర్థిక పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉండడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లోపే ఫెడ్ తమ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ఇంకో రెండు నెలల్లో రేట్ల కోత ఉంటుందని 75 శాతం మంది ట్రేడర్లు భావిస్తున్నట్టు ఐఎన్‌జీ రిపోర్ట్ తెలిపింది.