![బంగారం ధరలు ఫస్ట్ టైం ఇంత పెరిగాయ్.. ఇంత రేటు ఉంటే మిడిల్ క్లాస్ జనం.. తులం కూడా కొనలేరేమో..!](https://static.v6velugu.com/uploads/2025/02/gold-prices-surged-by-rs-1300-reaching-an-all-time-high-of-rs-89400-per-10-grams-in-delhi-as-reported-by-the-all-india-sarafa-association_NtnxqCgsif.jpg)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఫిబ్రవరి 14న ఒక్కరోజే 1300 రూపాయలు పెరిగి ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఫిబ్రవరి 14న ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (99.5 శాతం ప్యూరిటీ బంగారం) 10 గ్రాముల ధర 89,400 రూపాయలకు పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ రిపోర్ట్ చేసింది.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు, యూఎస్ డాలర్ విలువ బలపడటం, రూపాయి విలువ తగ్గడం.. ఇలా పలు అంశాలు భారత్ లో బంగారం ధర పెరుగుదలకు కారణమవుతున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం రూ.2 వేలు పెరగడంతో కిలో వెండి ధర మళ్లీ లక్ష మార్క్ను చేరింది.
విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష టచ్ అవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్య తరగతి జనం బంగారం కొనడానికి నానా తిప్పలు పడ్తున్నారు.
జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవనే సంగతి తెలియంది కాదు. ఆయా కుటుంబాలు తాహతును బట్టి పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన గోల్డ్ రేట్లతో వధువు తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు.