
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో బలహీన పోకడల మధ్య సోమవారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.వెయ్యి తగ్గి రూ.98,400కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం ప్యూరిటీల కలిగిన పుత్తడి ధర తాజాగా రూ.99,400 వద్ద ముగిసింది. 99.5 శాతం ప్యూరిటీల కలిగిన బంగారం విలువ రూ.వెయ్యి తగ్గి రూ.97,900కు చేరుకుంది. ఇది మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.98,900 పలికింది.
‘‘అమెరికా,- చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల పెట్టుబడిదారుల రిస్క్ సామర్థ్యం పెరిగింది. బంగారానికి డిమాండ్ తగ్గింది. డాలర్ పెరుగుదల బంగారంపై ఒత్తిడిని పెంచింది" అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. చైనా కొన్ని యూఎస్ దిగుమతులను దాని 125 శాతం సుంకాల నుంచి మినహాయించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సోమవారం వెండి ధరలు కూడా కిలోకు రూ.1,400 తగ్గి రూ.98,500కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఒకశాతం తగ్గి ఔన్సు ధర 3,291.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.