బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 80 వేలు దాటి 81 వేల రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై శుక్రవారం 650 రూపాయలు పెరిగింది. దీంతో.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం నాడు 73,900 రూపాయలు ఉండగా శుక్రవారం ఈ ధర 600 పెరిగి 74,500 రూపాయలకు చేరింది.
బంగారం ధరలు ఇలానే పెరుగుతూ పోతే.. జనవరి నెల ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 85 వేల మార్క్ను చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెండి ధర కూడా ఇవాళ (జనవరి 17, శుక్రవారం) భారీగా పెరిగింది. గురువారం కిలో వెండి ధర రూ.1,03,000గా ఉండగా శుక్రవారం వెయ్యి రూపాయలు పెరిగి రూ.1,04,000 చేరింది.
భారత్లో బంగారం, వెండి ధరలు డాలర్తో రూపాయి విలువతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు.
ALSO READ | 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు!
ఇండియాలో బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. పసిడికి సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో దీనిని భారీగా కొంటారు. చాలా మందికి దీనిని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. 24 క్యారెట్ల బంగారం ధర 2025 డిసెంబర్ నాటికి లక్షకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.