బంగారం కొనాలనుకునే వారికి రోజు రోజుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకోగా.. ఇప్పుడు అంతకుమించి పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో బంగారం రేట్లు రోజు రోజుకు ఎగబాకుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వరుసగా ఐదోవసారి కూడా యథాతథంగానే ఉంచుతున్నట్లు ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. అయితే సాధారణంగా ఇలా ప్రకటన చేస్తే.. ఏమయ్యేది కాదేమో.. కానీ ఫెడ్ ఈ సంవత్సరంలో కనీసం 3 సార్లు వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీంతో పసిడి రేట్లు కొద్ది రోజుల కిందట రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతకుముందే తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.
ఫెడ్ ప్రకటనతో బంగారం ఒక్కసారిగా డిమాండ్ అందిపుచ్చుకుంది. యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ నుంచి ఒక్కసారిగా బంగారం, స్టాక్ మార్కెట్లపై మళ్లింది. దీంతో మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరగడం సహా గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్ల కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ మహానగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఫెడ్ ప్రకటన తర్వాత ఒక్కరోజులోనే ఏకంగా రూ. 1000 పెరిగింది. దీంతో ఇప్పుడు తులానికి రూ. 61,810 మార్కు వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ పసిడి ధర ఏకంగా రూ. 1090 ఎగబాకి 10 గ్రాములకు రూ. 67,430 వద్దకు చేరింది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో తాజాగా కేజీ వెండి ధర రూ. 1500 పెరిగి ప్రస్తుతం రూ. 81,500 మార్కు వద్ద ఉంది.