Gold Rally: MCXలో రికార్డు బద్దలుకొట్టిన గోల్డ్.. ఏకంగా రూ.95వేలు క్రాస్.. ఇకపై బంగారం కొనలేమా..?

Gold Rally: MCXలో రికార్డు బద్దలుకొట్టిన గోల్డ్.. ఏకంగా రూ.95వేలు క్రాస్.. ఇకపై బంగారం కొనలేమా..?

Gold Rates News: ప్రస్తుతం పసిడి ధరలు ఇటు రిటైల్ మార్కెట్లతో పాటు అటు స్పాట్ మార్కెట్లలో కూడా భారీగా పెరుగుతున్నాయి. నేడు ఇంట్రాడేలో పసిడి ఎంసీఎక్స్ లో తొలిసారిగా 10 గ్రాములకు రూ.95వేల మార్కును అధిగమించింది. దేశీయ ఫ్యూచెర్స్ మార్కెట్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో తొలిసారిగా పసిడి రూ.95వేల 090 రేటుకు ఎగబాకి ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే సాంయంత్రం 4.20 గంటల సమయంలో ఇది 95వేల 095 వద్దకు చేరుకుని తన రికార్డులను అదే బద్ధలు కొట్టుకుంటోంది. 

ఇదే క్రమంలో వెండి ధర స్పాట్ మార్కెట్లో కేజీకి రూ.96వేల 344ను ఇంట్రాడేలో చేరుకుంది. అయితే అకస్మాత్తుగా పసిడి ధరలు నిన్నటి వరకు తగ్గుతున్న స్థాయి నుంచి తిరిగి పుంజుకోవటానికి కారణం అమెరికన్ డాలర్ విలువ క్షీణతవల్లనేనని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్స్ ప్రభావంతో ప్రపంచ దేశాలకు అమెరికాపై నమ్మకాన్ని కోల్పోవటం డాలర్ బలహీనతకు దారితీసిందని వారు చెబుతున్నారు. 

మరోపక్క అంతర్జాతీయ సంస్థలు 2025లో పసిడి ధర 10 గ్రాములకు లక్ష రూపాయల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. అమెరికాను ప్రపంచ దేశాలు నమ్మకమైన వ్యాపార భాగస్వామిగా గుర్తించకపోవటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా భారతదేశానికి స్నేహహస్తం అందిస్తూ అమెరికా వల్ల జరిగిన వాణిజ్య నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే భారీగా వీసాల జారీ సంఖ్య పెంపును ప్రకటించింది.

అనేక దశాబ్ధాలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలను ప్రజలు అస్థిర పరిస్థితుల్లో తమ సంపదను కాపాడుకోవటానికి మంచి పెట్టుబడి మార్గంగా పరిగణిస్తూనే ఉన్నారు. మరో పక్క అమెరికా బాండ్స్ మార్కెట్లో అమ్మకాలు కూడా పసిడిలో పెట్టుబడులవైపు ఇన్వెస్టర్లు, ప్రజలు చూసేలా చేస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు పసిడిని భౌతికంగా లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంటే మరికొన్ని త్రైమాసికాల పాటు గోల్డ్ తన ర్యాలీని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.