హైదరాబాద్లో ఆల్ టైం హైకి బంగారం ధరలు.. దూసుకుపోయిన తులం ధర..

హైదరాబాద్లో ఆల్ టైం హైకి బంగారం ధరలు.. దూసుకుపోయిన తులం ధర..

బంగారం ధరలు ఎక్కడా తగ్గట్లేదు. కాస్తైనా తగ్గితే కొందాం.. అని వేచి చూస్తున్న వాళ్లెవరకీ అందనంత ఎత్తులో కూర్చుంది గోల్డ్. సోమవారం (ఫిబ్రవరి 10) హైదరాబాద్ లో ఆల్ టైమ్ హై కి చేరుకుంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.79,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ 87,060 రూపాయలకు చేరుకుంది. 

ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి ఈ పది రోజుల్లోనే 3 శాతం పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ నెల స్టార్టింగ్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.77,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 84,490 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

దేశ వ్యాప్తంగా ఉన్న ధరల ప్రభావంతో హైదరాబాద్ లో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూర్ తదితర ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలు మండుతూనే ఉన్నాయి. 

మల్టీ కమోడిటీ ఎక్స్ చేంజ్ (MCX) లో ఏప్రిల్ నెల 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ (కాంట్రాక్ట్స్) 85,384 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ధరల ఆధారంగా కమోడిటీ ఫ్యూచర్స్ ఉంటాయి. 

బంగారం పెరుగుదలకు కారణం:

బంగారం నిరంతరాయంగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితే. ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్ లు (పన్నులు) విధిస్తానని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలపై టారిఫ్ లు విధించి మళ్లీ వాయిదా వేశారు. తాజాగా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం పన్ను విధించున్నట్లు వార్తలు రావడంతోమరోసారి అంతర్జాతీయంగా అన్ సర్టైనిటీ మొదలయ్యింది. 

బంగారంపై పెరుగుతున్న పెట్టుబడులు:

అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి కారణంగా మార్కెట్లలో పెట్టుబడులు తగ్గించడం, లేదంటే అమ్ముకోవడం జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థిరమైన రిటర్న్స్ ఇచ్చే గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. మరోవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ నిల్వలు పెంచుకుంటోంది. దీంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఆల్ టైమ్ హై కి చేరుకున్నాయి.