Gold Rates: గోల్డ్ ప్రియులకు ఊరట.. తులం 16వందలు తగ్గిన బంగారం

Gold Rates: గోల్డ్ ప్రియులకు ఊరట.. తులం 16వందలు తగ్గిన బంగారం
  • ఒక్క రోజులోనే 10 గ్రాములపై రూ.1,600 పతనం
  • హైదరాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.84,000 
  • 24 క్యారెట్ల బంగారం తులం రూ. రూ.91,640
  • భవిష్యత్​లో హెచ్చుతగ్గులు ఉంటాయంటున్న ఎనలిస్టులు
  • క్రూడ్​ఆయిల్, వెండి ధరల్లోనూ భారీ పతనం
  • ట్రంప్​ టారిఫ్​ల ఎఫెక్ట్​తో  కుప్పకూలుతున్న ప్రపంచస్టాక్​ మార్కెట్లు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: అమెరికా ప్రెసిడెంట్ ​ట్రంప్ ​ప్రకటించిన టారిఫ్​లు ప్రపంచ స్టాక్​ మార్కెట్లపైనే కాకుండా గోల్డ్, క్రూడ్​ ఆయిల్ ధరలపైనా తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. ఇండియా ప్రొడక్టులపై 26 శాతం టారిఫ్‌‌‌‌ వేస్తామని ట్రంప్​ చేసిన ప్రకటనతో రెండు రోజులుగా మన స్టాక్​ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా..ఐదు రోజులుగా పెరుగుతున్న బంగారం రేటు శుక్రవారం పతనమైంది. 

ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్​ ధర హైదరాబాద్​మార్కెట్​లో శుక్రవారం రూ,1,600 తగ్గి రూ.84,000 వద్ద స్థిరపడింది. గోల్డ్​ బిస్కెట్లు, కాయిన్స్​లో వాడే10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.93,380 ఉండగా, శుక్రవారం రూ.1,740 తగ్గి  రూ.91,640కి పడిపోయింది. వెండి రేటు కూడా భారీగానే పడిపోతున్నది. గురువారం హైదరాబాద్ లో కిలో వెండి ధర  రూ.లక్షా 12 వేలు ఉండగా, అది శుక్రవారం రూ.4 వేలు తగ్గి రూ.లక్షా 8 వేల వద్ద స్థిరపడింది. 

పెరగాలి.. కానీ తగ్గుతున్నది?

వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా, గ్లోబల్‌‌‌‌గా అనిశ్చితి ఏర్పడినా అది స్టాక్​ మార్కెట్లతోపాటు గోల్డ్, క్రూడ్​ రేట్లపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా షేర్ల ధరలు భారీగా పతనం అవుతాయి. గోల్డ్, క్రూడ్​ ఆయిల్​ రేట్లు పెరుగుతాయి. కానీ ఈ సారి ట్రంప్​ ప్రకటనపై ప్రపంచ దేశాలు భయపడుతున్న ఈ టైమ్​ లో వివిధ దేశాల స్టాక్​ మార్కెట్లతోపాటు బంగారం, క్రూడ్​ రేట్లు కూడా తగ్గుతున్నాయి. 

ఈ పరిస్థితి ఇన్వెస్టర్ల భయాన్ని సూచిస్తున్నదని, స్టాక్స్​ నుంచి తీసిన మొత్తాన్ని బంగారం, క్రూడ్​ వంటి వాటిల్లో పెట్టకపోగా.. వాటిల్లోంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చని అంటున్నారు. టారిఫ్‌‌‌‌ల వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తే .. బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు మరికొంత దిగిరావొచ్చనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుత ట్రెండ్స్, నిపుణుల అంచనాల ప్రకారం.. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో భవిష్యత్​తో ఇండియాలో బంగారం రేట్లు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.

 ట్రంప్ చాలా దేశాలపై 25 శాతానికి పైగానే  సుంకాలు విధించారు. దీంతో యూఎస్‌‌‌‌లో ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ పెరుగుతుందని, డాలర్ విలువ పడిపోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇది జరిగితే గోల్డ్‌‌‌‌ ధరలు మరో 5–10 శాతం పెరుగుతాయని అంటున్నారు. 

క్రూడాయిల్‌‌‌‌ ధరలు తగ్గుతాయా?

ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్‌‌‌‌ ధర శుక్రవారం బ్యారెల్‌‌‌‌కు 65 డాలర్ల దిగువకు పడిపోయింది.  ఒపెక్‌‌‌‌ ప్లస్ దేశాలు ప్రొడక్షన్ పెంచుతామని ప్రకటించడంతోపాటు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందనే అంచనాలతో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి. ఆయిల్ దిగుమతులపై ఆధారపడే ఇండియాకు ఇది మేలు చేసే అంశం. కానీ, బ్రెంట్ ఆయిల్ ధరలు రానున్న నెలల్లో పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇండియాకు ఆయిల్ సప్లయ్ చేస్తున్న సౌదీ అరేబియా, ఇరాక్, రష్యాను డైరెక్ట్‌‌‌‌గా టార్గెట్ చేయలేదు.

 అయినప్పటికీ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దేశాలు మెక్సికో, కెనడాపై 25 శాతం టారిఫ్ వేసింది. ఫలితంగా గ్లోబల్‌‌‌‌గా ఆయిల్ సప్లయ్ చెయిన్‌‌‌‌లో అంతరాయం ఏర్పడనుంది.  ఈ ప్రభావం క్రూడ్‌‌‌‌పై పడుతుందని అంచనా. బ్రెంట్ ఆయిల్ ధరలు రానున్న నెలల్లో బ్యారెల్‌‌‌‌కు 85–90 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ధరలను ఫాలో అయ్యే ఇండియాపై నెగెటివ్ ప్రభావం పడనుంది. 

ఇండియా ఆయిల్ దిగుమతుల ఖర్చులు డాలర్లలో 10 శాతం వరకు పెరగనున్నాయి. ఇండియా ప్రస్తుతం బ్యారెల్‌‌‌‌కు రూ.6,700  (రూపాయి విలువ డాలర్‌‌‌‌‌‌‌‌కు రూ.84.5 అనుకుంటే) చెల్లిస్తున్నది. ఒమన్‌‌‌‌, దుబాయ్‌‌‌‌ నుంచి ఇండియా బ్రెంట్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకుంటున్నది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌‌‌‌కు  90 డాలర్లకు చేరుకుంటే ఇండియా చెల్లించే ధర కూడా బ్యారెల్‌‌‌‌కు రూ.7,800–8,000కు పెరిగే ఛాన్స్ ఉంది. ఫలితంగా పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరలు లీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.3–5 పెరగొచ్చు. 

ఇప్పుడు రూపాయి బలపడుతోంది, కానీ.. 

ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్‌‌‌‌లోకి తిరిగి వస్తుండడంతో రూపాయి విలువ బలపడుతున్నది. డాలర్ మారకంలో రూపాయి శుక్రవారం 85.25 దగ్గర సెటిలైంది. 87 లెవెల్‌‌‌‌ వరకు పడిన మన కరెన్సీ ఈ మధ్య కొలుకుంటోంది. మన ఎగుమతుల్లో 18శాతం (ఎక్కువగా జ్యుయలరీ, టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌, ఫార్మా) యూఎస్‌‌‌‌కు జరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌‌‌‌ల వలన ఇరు దేశాల మధ్య ట్రేడ్ బ్యాలెన్స్‌‌‌‌ బలహీనమవుతుంది. 

మన ప్రొడక్టులకు యూఎస్‌‌‌‌లో డిమాండ్ పడిపోవచ్చు. ఫలితంగా రూపాయి విలువ రానున్న నెలల్లో  86–87 వరకు బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు యూఎస్ బాండ్ల వైపు క్యూ కట్టొచ్చు. ఇదే జరిగితే ఇండియా కరెన్సీ విలువ మరింత క్షీణిస్తుంది.