- తూంకుంటలోని గోల్డ్ షాపులో నగలు ఎత్తుకెళ్లి..
- అమ్ముతూ ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
శామీర్ పేట, వెలుగు: ఆర్థికంగా స్థిరపడదామని చోరీ చేసి దొరికిపోయారు. నిందితుల్లో ఇద్దరు పట్టుబడగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి సోమవారం శామీర్ పేట్ పీఎస్ లో కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన శంకర్ సింగ్, జలం సింగ్, హనుమంత్ సింగ్, శంకర్ సింగ్ సిటీకి వచ్చి అల్వాల్ సూర్యనగర్ లో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ డ్రైవర్లుగా చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడదామనుకుని చోరీకి ప్లాన్ చేశారు. ఈనెల 6న గజ్వేల్ మార్కెట్ లో పల్సర్ బైక్ ను చోరీ చేశారు.
అదే రోజు రాత్రి శామీర్ పేట మండలం తూంకుంటలోని శ్రీకృష్ణ జువెలరీ షాప్ లో బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం స్థానికంగా టిఫిన్ సెంటర్ పెట్టే వ్యక్తి చూసి గోల్డ్ షాపు ఓనర్ కు ఫోన్ చేసి చెప్పాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ లు 300 సీసీ ఫుటేజ్ లను చెక్ చేశాయి. జువెలరీ షాపు షట్టర్ పగలకొట్టి గోల్డ్, వెండి నగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దొంగలు చోరీ నగలను పంచుకుని.. సోమవారం వాటిని అమ్మేందుకు ఇద్దరు నిందితులు యత్నిస్తుండగా నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు హనుమంత్ సింగ్, శంకర్ సింగ్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల వద్ద 11.5 తులాల గోల్డ్, 46 కిలోల వెండి నగలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన సీసీఎస్, ఎస్వోటీ, శామీర్ పేట్ పోలీసులను ఆయన అభినందించారు.