బంగారానికి రెక్కలు.. కొత్త ఏడాది రూ.90 వేలకు చేరే చాన్స్..​ అంతర్జాతీయ పరిస్థితులతో మస్తు డిమాండ్​

బంగారానికి రెక్కలు.. కొత్త ఏడాది రూ.90 వేలకు చేరే చాన్స్..​ అంతర్జాతీయ పరిస్థితులతో మస్తు డిమాండ్​

న్యూఢిల్లీ :  కొత్త సంవత్సరంలోనూ బంగారం ధరలు దూసుకుపోనున్నాయి. పది గ్రాముల ధర రూ.90 వేలకు చేరే అవకాశం ఉందని బులియన్​ఎక్స్​పర్టులు చెబుతున్నారు. యుద్ధం వంటి అంతర్జాతీయ సమస్యలు, గ్లోబల్​ మార్కెట్లలో అనిశ్చితుల వల్ల పుత్తడికి డిమాండ్​ విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. సెంట్రల్​బ్యాంకులు కూడా మరింత బంగారాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి. 

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం వంటి సమస్యలు పరిష్కారమైతే మాత్రం ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. స్పాట్​ మార్కెట్లలో గోల్డ్​ధర ప్రస్తుతం రూ.79,350 పలుకుతుండగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్​లో రూ.76,600 ఉంది. గత ఏడాది బలమైన డిమాండ్​ కారణంగా ధరలు 23 శాతం వరకు పెరిగాయి. అక్టోబరు 30వ తేదీన ధర ఆల్​టైం హై రూ.82,400లకు ఎగిసింది. వెండి ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. కిలో వెండి ధర 30 శాతం పెరగడంతో రూ.లక్షకు చేరుకుంది. 

అంతర్జాతీయ మార్కెట్లోనూ...

అంతర్జాతీయంగా చూస్తే  కామెక్స్​ గోల్డ్​ ఫ్యూచర్స్​లో ధరలు గత ఏడాది ఔన్సుకు 2,062 డాలర్ల దగ్గర మొదలై అక్టోబరు 31న 2,790 డాలర్లకు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ సమస్యల కారణంగా ధరలు 28 శాతం వరకు పెరిగాయి. 2025లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు తగ్గే అవకాశం లేదని, సెంట్రల్​బ్యాంకులు మరింత బంగారం కొంటాయని అంటున్నారు. 

ఈ విషయమై ఎల్​కేపీ సెక్యూరిటీస్​ ఎనలిస్ట్​ జతిన్​ త్రివేది మాట్లాడుతూ గత సంవత్సరం అంతలా కాకపోయినా ఈ ఏడాది  బంగారం ధరలు మోస్తరుగా పెరుగుతాయని చెప్పారు. డొమెస్టిక్​ మార్కెట్లో ధరలు రూ.85 వేల వరకు వెళ్తాయని, డిమాండ్​ మరీ ఎక్కువైతే రూ.90 వేల మార్కుకు చేరుకుంటాయని చెప్పారు. వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు దూసుకెళ్లవచ్చని వివరించారు. 

వడ్డీరేట్లపై సెంట్రల్​బ్యాంకుల నిర్ణయాలు, డాలర్​విలువ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వడ్డీరేట్లను తగ్గించే విషయంలో యూఎస్​ఫెడ్​ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనివల్ల బంగారం ధరలు వేగంగా పెరగకపోవచ్చనే వాదనలూ ఉన్నాయి. రష్యా–యుక్రెయిన్​యుద్ధం వల్ల పసిడికి గిరాకీ బాగా పెరిగిందని ఆయన వివరించారు. కామ్​ట్రెండ్జ్​ రీసెర్చ్​ సీఈఓ జ్ఞానశేఖర్​ త్యాగరాజన్​ మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలని యూఎస్​ఫెడ్​ టార్గెట్​గా పెట్టుకుందని, ఇదే జరిగితే బంగారానికి డిమాండ్​ తగ్గవచ్చని చెప్పారు. 2025 మొదటి ఆర్నెళ్లలో బంగారానికి డిమాండ్​ తక్కువే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఔన్సు ధర 2,455 డాలర్ల వరకు ఉండొచ్చని, రూపాయి విలువ మరింత తగ్గవచ్చని ఆయన వివరించారు.