
బెంగుళూర్: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి, డీజేపీ రామచంద్రరావు కూతురు రన్యా రావును డీఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 2025, మార్చి 9 నుంచి 2025, మార్చి 11 వరకు రన్యా రావును డీఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాన్యా రావును డీఆర్ఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కస్టడీలో గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు రాన్యా రావు నేరం అంగీకరించినట్లు సమాచారం. అలాగే.. ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నటి రన్యా రావు అతడి కోసమే గోల్డ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రన్యా రావు బ్యాంక్ చెల్లింపులపై ఫోకస్ పెట్టిన అధికారులు.. ఆ రాజకీయ నాయకుడు ఎవరూ అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. నటి, డీజేపీ కూతురు అయ్యి ఉండి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో ఇప్పటికే రన్యా రావు వ్యవహారం కర్నాటకలో కాక రేపుతుండంగా.. తాజాగా ఈ కేసులో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకునేలా కనిపిస్తోంది. రాజకీయ నేత పేరు తెరపైకి రావడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే.. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆమె భర్త, ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రన్యా రావుతో కలిసి అతడు కూడా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో అతడి ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణల మేరకు పోలీసులు జతిన్ హుక్కేరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని నటి రన్యా రావు ఆర్థిక నేరాల కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరీ కోర్టుకు ఆమెకు బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.
కాగా, దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన రన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో మార్చి 3వ తేదీ రాత్రి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు రెండో భార్య కుమార్తె. రామచంద్రరావు మొదటి భార్య మరణించిన తర్వాత తిరిగి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యా రావు ఒకరు.