న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తొలిసారిగా 10 గ్రాముల ధర రూ. 82వేల మార్కును దాటింది. దీపావళికి ముందు ఆభరణాల వ్యాపారులు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. వెయ్యి పెరిగి ఢిల్లీలో 10 గ్రాముల తాజా గరిష్ట స్థాయి రూ.82,400కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన విలువైన లోహం ధర కూడా రూ. వెయ్యి పెరిగి స్థానిక మార్కెట్‌లలో 10 గ్రాములకు రూ.82వేల వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
క్రితం సెషన్‌లో 99.9 శాతం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు వరుసగా రూ.81,400, రూ.80 వేల వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, దీపావళి డిమాండ్ కారణంగా కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం ధర గత ఏడాది అక్టోబర్ 29 నుంచి 35 శాతం పెరిగింది. వరుసగా ఐదవ రోజు లాభాలను పొడిగిస్తూ, వెండి కూడా కిలోకు రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు చేరుకుంది. క్రితం ముగింపు కిలోకు రూ.99,700గా ఉంది.