తులానికి రూ. 77 వేలు ఎట్లిస్తరు: బ్యాంకు ముందు గోల్డ్ బాధితుల ఆందోళన

తులానికి రూ. 77 వేలు ఎట్లిస్తరు: బ్యాంకు ముందు గోల్డ్ బాధితుల ఆందోళన
  • వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన 

రాయపర్తి, వెలుగు: మార్కెట్ లో  గోల్డ్ ధర రూ.87 వేల వరకు ఉండగా.. తమకు అంతకంటే తక్కువ ఇవ్వడం ఏంటని బ్యాంక్ అధికారులపై బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బ్యాంక్​లో కుదవ పెడితే చివరకు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్​జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్​బీఐలో గతేడాది నవంబర్​లో గోల్డ్ చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే.  

బ్యాంకులో చొరబడిన దొంగలు రూ.13.61 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.  పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏడుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 19 కిలోల గోల్డ్ ఎత్తుకెళ్లగా 2 కిలోల 520 గ్రాముల మాత్రమే రికవరీ చేశారు. ఘటనపై అప్పట్లోనే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

బ్యాంక్​ అధికారులు గోల్డ్ ఎక్కడికి పోదని నచ్చజెపుతుండగా నెలలు గడుస్తుండగా చివరకు బాధితులకు నగదుగా ఇచ్చేందుకు.. 22 క్యారెట్ల గోల్డ్  పది గ్రాముల కు  రూ.77,710 చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. దీంతో బుధవారం బ్యాంక్​ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంక్​ మేనేజర్​సత్యనారాయణ నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. కాగా రూల్స్ మేరకు డబ్బులు నిర్ణయించామని బ్యాంక్​ అధికారులు తెలిపారు.