మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి రూ.15 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితుల కథనం ప్రకారం..పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ వ్యాపారి దశాబ్దాలుగా జ్యువెల్లరీ షోరూం నిర్వహిస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని ఆభరణాలు తయారు చేయమని ఇచ్చారు. ఇంకొందరు బిజినెస్ కోసం సుమారు రూ.5 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది.
అయితే, వారం నుంచి సదరు వ్యాపారి షో రూం ఓపెన్ చేయకపోవడంతో బాధితులు రోజూ వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో పాటు అతడి కుటుంబసభ్యులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. చివరకు ఆరా తీస్తే సుమారు రూ.15 కోట్ల బంగారాం, నగదుతో పరారయ్యాడని తెలిసింది. తీరా చూస్తే శుక్రవారం సదరు వ్యాపారి సుమారు 27 మందికి నోటీసులు పంపారు. తాను బాకీ ఉన్న వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నాడు. నోటీసులు చూసుకున్న వారితో పాటు ఇతర బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కాయకష్టం చేసుకొని సంపాదించిన డబ్బులతో బంగారు ఆభరణాలు తయారు చేయమని ఇచ్చామని కొందరు ఏడుస్తుండగా, మరికొందరు తమ బిడ్డల పెండ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలు ఇస్తే ముంచాడని వాపోతున్నారు. తమ బంగారం తమకు ఇప్పించాలని కోరుతున్నారు.