భారీగా బంగారం కొన్నరు.. మార్చిలో రూ.37 వేల కోట్ల విలువైన దిగుమతులు

భారీగా బంగారం కొన్నరు.. మార్చిలో రూ.37 వేల కోట్ల విలువైన దిగుమతులు

న్యూఢిల్లీ: పసిడి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నా, వాటి కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. గత నెల వీటి దిగుమతులు భారీగా పెరిగాయి.  ఫిబ్రవరితో పోలిస్తే బంగారం దిగుమతుల విలువ మార్చిలో 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  జనవరిలో ఇది1.53 బిలియన్ డాలర్లుగా ఉంది.  2024-–25  ఏప్రిల్–-మార్చిలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బౌండ్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విలువ 27.27 శాతం పెరిగి 58 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

ఇది 2023–-24లో  45.54 బిలియన్ డాలర్లుగా ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో  కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బంగారానికి అన్ని వర్గాల నుంచి డిమాండ్ ​పెరుగుతోంది. ఢిల్లీలో గురువారం బంగారం ధరలు రూ.70 పెరిగి మరో రికార్డు గరిష్ట స్థాయి రూ.98,170కి చేరుకున్నాయి.  డాలర్ విలువ తగ్గడం,  వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో ధరలు రికార్డుస్థాయికి దూసుకెళ్లాయి. 

కిలో వెండి ధర రూ.1,400 తగ్గి రూ.98 వేలకు చేరుకుంది. గత మార్కెట్ ముగింపులో కిలోకు రూ.99,400 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మార్చిలో వెండి దిగుమతుల విలువ 85.4 శాతం తగ్గి 119.3 మిలియన్ డాలర్లకు చేరుకుంది. 2024–-25లో ఏడాది లెక్కన 11.24 శాతం తగ్గి 4.82 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

స్విట్జర్లాండ్​..నంబర్​వన్​

 ప్రపంచంలో స్విట్జర్లాండ్ అత్యధికంగా బంగారాన్ని కొంటుంది. మొత్తం దిగుమతుల్లో దీని వాటాయే 40 శాతం వరకు ఉంటుంది. తరువాతి స్థానాల్లో యూఏఈ (16 శాతానికి పైగా),  దక్షిణాఫ్రికా (సుమారు 10 శాతం) ఉన్నాయి. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు.  దేశం మొత్తం దిగుమతుల్లో ఈ  బంగారం వాటా 8 శాతం. టన్నుల్లో లెక్కన దిగుమతులు 2023–-24లో 795.32 టన్నుల నుంచి 2024–-25లో 757.15 టన్నులకు తగ్గాయి. 

ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు దాదాపు 62 శాతం తగ్గగా, జనవరిలో 40.8 శాతం, 2024  డిసెంబర్​లో 55.39 శాతం పెరిగాయి. బంగారం దిగుమతుల పెరుగుదల వల్ల దేశ వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) మార్చిలో  21.54 బిలియన్​డాలర్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది  282.82 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబర్ క్వార్టర్లో భారతదేశ కరెంటు ఖాతా లోటు  11.5 బిలియన్ డాలర్లకు లేదా జీడీపీలో 1.1 శాతానికి పెరిగింది.