- తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ఆఫ్రికాను చీకటి ఖండం అని పిలుస్తారు. ఆ పేరుకు తగ్గట్టే పేదరికం వల్ల అక్కడి జనాల బతుకులు చీకట్లోనే మగ్గిపోతున్నాయి. ఆఫ్రికాలోని అలాంటి ఒక చీకటి దేశమైన కాంగోకు ఊహించని అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా 60 నుంచి 90 శాతం బంగారం నిల్వలు ఉన్న కొండ దొరికింది. ఆ దేశంలోని సౌత్ కివు ప్రావిన్స్‌లోని లుహిహిలో ఈ బంగారు కొండ ఉంది. దీని జాడ ఎవరు కనిపెట్టారో గానీ, బంగారు కొండ ఉందన్న విషయం ప్రభుత్వాని కన్నా ముందు జనాల్లో స్ప్రెడ్ అయిపోయింది. ఊర్లకు ఊర్లకు ఆ వార్త పాకిపోయింది. అంతే దొరికినోళ్లకు దొరికినంత ఆ కొండ మట్టిని తవ్వుకెళ్లడం షురూ చేశారు. పార, పాలుగు, అంతెందుకు చేతులతో కూడా కొండను తవ్వేసి, మట్టిని ఇండ్లకు తీసుకుపోయారు. మట్టిని నీళ్లలో కడిగి, చేత్తోనే ప్రాసెస్ చేసి బంగారం తీసేశారు. ఆ రేంజ్‌లో కొండ మట్టిలో 60–90 శాతం బంగారం ఉండడం మామూలు విషయం కాదు. జనాలు ఇలా కొండను తవ్వి ఆ బంగారు మట్టిని తీసుకెళ్తున్న వీడియోను అహ్మద్ అల్గోబరి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పబ్లిక్ తవ్వకంపై సర్కారు బ్యాన్
బంగారు కొండకు వేలాదిగా జనం ఎగబడి మట్టి తవ్వుకుని వెళ్లి చేతులతోనే ప్రాసెస్ చేసి బంగారాన్ని తీసేంత క్వాలిటీ కాంగో సర్కారును కూడా షాక్‌కు గురి చేసింది. ఈ జనాలను ఇలానే వెళ్లనిస్తే కొద్ది మంది జనమే ఆ కొండను ఖాళీ చేయడం ఖాయమని భావించి, పబ్లిక్ తవ్వకంపై కాంగో ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మైనింగ్ శాఖ మంత్రి ముహిగిర్వా ప్రకటించారు. అయితే ఆ దేశంలో వజ్రాలు, బంగారం లాంటి గనులు పుష్కలంగా ఉంటాయి. మెషీన్లతో పని లేకుండా సంప్రదాయ పద్ధతుల్లో వాటిని ప్రాసెస్ చేసేందుకు కావాల్సిన చిన్న చిన్న టూల్స్ కూడా జనాల దగ్గర ఉండడం అక్కడ కామన్.