యాదాద్రి నర్సన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర

  • బంగారు శాలువా సైతం
  • అందజేసిన సిరిసిల్ల వాసి నల్ల విజయ్​
  • 2 గ్రాముల గోల్డ్​తో తయారీ  

యాదగిరిగుట్ట, వెలుగు : సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే బంగారు చీరను తయారుచేసి మంగళవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి బహూకరించాడు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ 2 గ్రాముల బంగారంతో ఐదున్నర గజాల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 150 గ్రాముల చీరను, మరో 2 గ్రాముల బంగారంతో రెండున్నర గజాల పొడవు, 32 ఇంచుల వెడల్పుతో 60 గ్రాముల బరువున్న శాలువాను తయారు చేశాడు. వాటిని వేర్వేరు అగ్గిపెట్టెల్లో ఇమిడ్చి యాదగిరిగుట్ట ఆలయానికి అందజేశాడు.

విజయ్ మాట్లాడుతూ బంగారు చీరను తయారు చేయడానికి 15 రోజులు పట్టిందని, ఇప్పటికే తిరుమల, విజయవాడ ఆలయాలకు ఇలాంటి చీరలను ఇచ్చామన్నారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పడం కోసం, తన తండ్రి నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని తాను కూడా అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరలను తయారు చేస్తున్నానన్నారు. ఆలయ ఏఈవో గజవెల్లి రఘు, ఉప ప్రధానార్చకులు మాధవాచారిపాల్గొన్నారు.