
దేశవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరుల (గ్రీన్ పవర్)కు ఆదరణ పెరుగుతోంది. సంస్కరణల పేరిట గనుల వేలంతో సింగరేణి మెడపై కత్తి వేలాడుతున్న తరుణంలో ఆ సంస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం, విలువైన భారీ యంత్ర సామగ్రి ఉన్న సింగరేణి ఉజ్వల భవిష్యత్తుకు ఊపిరి ఊదారు. సింగరేణి ప్రధాన కార్యాలయ కేంద్రమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డగా ఉప ముఖ్యమంత్రి అంది వచ్చిన ఒక గొప్ప కార్యక్రమానికి తన శక్తిని వినియోగించాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో బొగ్గు వినియోగం భారీగా పడిపోనుంది.
మరోవైపు బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే సింగరేణి మూత వేసే పరిస్థితి అనివార్యం. అందుకే అన్నిహంగులు ఉన్న సింగరేణి బొగ్గు తవ్వకం దగ్గరే ఎందుకు ఆగిపోవాలి..? విలువైన బంగారం, వజ్రాలు, క్రిటికల్ మైనింగ్ వైపు ఎందుకు వెళ్ళకూడదు. గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా ఆలోచన ఎందుకు చేయకూడదు అంటూ లోతైన అవగాహనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు.
విలువైన సహజవనరులు ఉన్నప్పటికీ వాటిని తవ్వి తీసుకోలేని మనదేశంలోని కాశ్మీర్‌తోపాటు, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాల్లో మైనింగ్‌కు ఉన్న అవకాశాలను అన్వేషించాలని, ఇందుకుగాను ప్రత్యేకంగా కన్సల్టెంట్లను నియమించి, మన ఇంజనీర్లు, సిబ్బంది.. కాంట్రాక్టులు దక్కిన చోటుకు వెళ్లి పనిచేసేలా సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బొగ్గు ఉత్పత్తికి నైనీ ప్రాజెక్టు సిద్ధం
డిప్యూటీ సీఎం భట్టి నిరంతర పర్యవేక్షణతో కొద్ది నెలల్లోనే అనుకున్న మేరకు ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మరో వందేళ్ల ఉజ్వల సింగరేణి దిశగా కార్యాచరణ ప్రణాళిక మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశా నిర్దేశంలో సుస్థిర సింగరేణి కోసం విస్తృత విస్తరణ ప్రణాళికలు అమలువుతున్నాయి. ముఖ్యంగా పదేళ్లుగా పురోగతిలేని నైనీ ప్రాజెక్టు విషయంలో భట్టి విక్రమార్క చొరవ తీసుకొని ఒడిశాలో పర్యటించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, అటవీ భూ బదలాయింపునకు కృషి చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు ఈ నెలాఖరుకు బొగ్గు ఉత్పత్తికి సంసిద్ధమవుతోంది.
ఒడిశాలో పవర్ ప్లాంట్
మరోవైపు ఈ బొగ్గును సింగరేణి థర్మల్ విద్యుత్ అవసరాలకు వినియోగించుకోవాలన్న నిబంధన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ బొగ్గును అక్కడే వినియోగించుకోవడానికి వీలుగా 1,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి ఒడిశాలో పర్యటించి ఈమేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి వినతి పత్రం ఇచ్చారు.
పవర్ ప్లాంట్ ఏర్పాటుకు భూ సేకరణ, ఇతర అనుమతుల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూల స్పందన లభించింది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తికి, ముఖ్యంగా రాష్ట్రం వరకే పరిమితం చేయకూడదని, ఆ సంస్థ అనుభవాన్ని ఇతర రంగాల్లో ముఖ్యంగా రాష్ట్రాన్ని క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంలో సింగరేణి కీలక భూమిక పోషించేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
క్రిటికల్ మినరల్స్ అన్వేషణ
సింగరేణి ఆధ్వర్యంలో లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, ఉత్పత్తిలో పాలుపంచుకునేలా విజ్ఞానాన్ని పంచుకునేందుకు ఐ.ఐ.టీ హైదరాబాద్ తో కీలక ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇతర దేశాల్లో క్రిటికల్ మినరల్స్ మైనింగ్ సాధ్యాసాధ్యాలపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్‌తో ఇటీవలే సంప్రదింపులు జరిగాయి. త్వరలోనే సింగరేణి బృందాన్ని ఆస్ట్రేలియా, ఇతర
క్రిటికల్ మినరల్స్ నిల్వలు ఉన్న దేశాలకు పంపాలని నిర్ణయించారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా
సింగరేణి సంస్థ ఏటా ఉత్పత్తి చేసే సుమారు 700 లక్షల టన్నుల బొగ్గులో 90% థర్మల్ విద్యుత్తు సంస్థలకే సరఫరా అవుతుంది. తద్వారానే ఈ ప్లాంట్లు విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఇతర రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు, సిమెంటు సెరమిక్స్ స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా సుటికల్స్, ఎరువులు వంటి 2,000 పరిశ్రమలకు సింగరేణి సంస్థ బొగ్గు అందిస్తోంది. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచడంలో సంస్థ 13 దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తోంది.
విస్తరణ చర్యలలో భాగంగా సింగరేణి సంస్థ 2016లో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్వయంగా ప్రారంభించింది. 245 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఖాళీ ప్రాంతాల్లో నెలకొల్పి విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2020 నాటికి 430 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి కేవలం సోలార్ విద్యుత్ ద్వారా నడిచే పరిశ్రమగా, అనగా నెట్ జీరో కార్బన్ మిషన్ కంపెనీగా దేశంలో పేరు గడించాలని ముందుకుపోతోంది.
బహువిధ వ్యాపార విస్తరణ చర్యలు
వ్యాపార విస్తరణ జరపాలని సింగరేణి యోచిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్ లాండ్స్తో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చింది. 3,100 మెగావట్ల థెర్మల్ సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం ఇటీవల రాజస్తాన్ రాష్ట్ర విద్యుత్ విభాగంతో ఒప్పందం చేసుకుంది. స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, పవన విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంది. ఒడిశా రాష్ట్రంలో ఏడాదికి కోటి టన్నుల బొగ్గును అందించే నైనీ అనే అతిపెద్ద బొగ్గు బ్లాక్ ను కూడా చేపట్టింది.
ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల వేలంపాటలో పాల్గొని కొత్త బ్లాకులు చేపట్టాలని ఆలోచిస్తోంది. కార్మికుల సంక్షేమంలోనూ దేశంలో నెంబర్ వన్‌గా సింగరేణి సంస్థ నిలబడుతోంది. సిబ్బందికి కోటి 25 లక్షలు రూపాయల ప్రమాద బీమా, సివిల్ సర్వీస్ పరీక్షలకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థికసాయం పథకాన్ని కూడా అమలు జరుపుతోంది.
సింగరేణి భవిష్యత్తుకు భరోసా
సింగరేణిని మైనింగ్‌లోనే కాకుండా సంప్రదాయేతర ఇంధన వనరులైన సోలార్ రంగంలోనూ జాతీయ స్థాయి దిగ్గజ సంస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే రాజస్తాన్‌లోని సోలార్ వ్యాలీలో 1,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను, 1,600 మెగావాట్ల పిట్ హెడ్ ప్లాంట్లను సంయుక్తంగా ఏర్పాటు చేసే కీలక ఒప్పందాన్ని చేసుకోవడానికి అంగీకారం తెలిపింది.
మన సింగరేణి రాజస్తాన్ ప్రభుత్వ సంస్థ ఆర్ వీయూఎన్ ఎల్ (రాజస్తాన్ విద్యుత్ ఉత్పత్తి నిగం లిమిటెడ్)తో ఒప్పందం చేసుకోవడం చరిత్రాత్మక ఘట్టం. ఇలా వినూత్న విస్తరణ ప్రణాళికలతో సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది భవిష్యత్‌కు బలమైన భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. బొగ్గు మైనింగే కాకుండా ఇతర రంగాల్లోనైనా రాణించి సత్తా చాటేలా సింగరేణిని విస్తరిస్తోండటంపై యావత్ సింగరేణి హర్షం వ్యక్తం చేస్తోంది.
- మారబోయిన మధుసూధన్,
సీపీఆర్ఓ
డిప్యూటీ సీఎం