
Goldman Sachs: అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీల షేర్లలో ఈ సంస్థ పెట్టుబడులను సైతం పెడుతూ ఉంటుంది. అయితే ఈ వారం ప్రారంభంలో ఇండియాలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు అనుకూలమైన షేర్ల జాబితాను ప్రకటించిన కంపెనీ తాజాగా కొన్ని షేర్లను కూడా కొనుగోలు చేసింది.
తాజాగా గోల్డ్‌మన్ శాక్స్ అనుబంధించబడిన గోల్డ్‌మన్ శాక్స్ సింగపూర్ మెగా బల్క్ డీల్ ద్వారా కొన్ని షేర్లను కొనుగోలు చేసినట్లు బీఎస్ఈ డేటా వెల్లడించింది. ముందుగా ఈ ఆర్థిక సేవల దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయగా.. ఇదే క్రమంలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న జొమాటో షేర్లను కూడా పందెం వేయటానికి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ రెండు కంపెనీల షేర్లను ఏకంగా 2వందల 81 కోట్ల రూపాయలు వెచ్చించి ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసింది.
బీఎస్ఈ బ్లాక్ డీల్స్ డేటా గమనిస్తే గోల్డ్‌మన్ శాక్స్ సింగపూర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థలో 3.85 లక్షల షేర్లను కొనుగోలు చేసిందని తేలింది. అలాగే ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటోకి చెందిన 60.07 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. హాంకాంగ్‌కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కాడెన్సా క్యాపిటల్‌కు చెందిన కాడెన్సా క్యాపిటల్ ఫండ్ ఈ షేర్లను విక్రయించినట్లు వెల్లడైంది.
గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ షేర్లు ఒక నెల కాలంలో దాదాపు 35 శాతం పెరుగుదలను చూశాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జొమాటో స్టాక్ భారీ ఓలటాలిటీ కారణంగా 27 శాతం విలువను కోల్పోయినట్లు వెల్లడైంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.