
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఇవాళ(మార్చి 8, 2025) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 550 రూపాయలు పెరిగింది. దీంతో.. 87,160 రూపాయలు ఉన్న బంగారం ధర 87,710 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా 500 రూపాయలు పెరిగి 79,900 రూపాయల నుంచి 80,400 రూపాయలకు పెరిగింది. మార్చి 1న 24 క్యారెట్ల బంగారం ధర 86,620 రూపాయలు ఉండగా వారం రోజుల్లో 87,710 రూపాయలకు పెరిగింది.
అంటే.. మార్చి నెల మొదటి వారంలో బంగారం ధరపై 1,090 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ఖరీదు కూడా మార్చి 1న 79,400 రూపాయలు ఉండగా.. మార్చి 8 నాటికి 80,400కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. వెండి ధరల్లో శనివారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర లక్షా 8 వేల వంద రూపాయలుగా ఉంది.
ఇన్ ఫ్లేషన్స్ పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల కోసం గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరడం వంటి కారణాలతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ అధికమవటంతో.. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న క్రూడాయిల్, నిత్యావసర ధరలతో పాటు బంగారం ధరలు కూడా ప్రస్తుతం బాటలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెంచేస్తుంటాయి.
ఆర్థిక మాంద్యం పెరగటంతో పెట్టుబడిదారులు పసిడిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి మారకం రేటుకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగటం, తగ్గటం జరుగుతుంటాయి. అమెరికా వాణిజ్య విధానాలకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాలు పెంచడం వంటి నిర్ణయాలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.