బోనాలకు గోల్కొండ జగదాంబిక  ఆలయం ముస్తాబు

బోనాలకు గోల్కొండ జగదాంబిక  ఆలయం ముస్తాబు
  • తొందరలోనే కమిటీ సభ్యుల నియామకం

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి(ఎల్లమ్మ) ఆలయం బోనాల జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 22న జగదాంబికా మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించండంతో సిటీలో బోనాల జాతర మొదలుకానుంది.  నెల రోజుల పాటు నిర్వహించే బోనాల జాతరలో అమ్మవారికి తొమ్మిది పూజలు నిర్వహిస్తారు.  ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  రెండ్రోజులుగా గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. బోనాల జాతర నిర్వహణ కోసం ప్రతి ఏడాది ఐదుగురు సభ్యులతో దేవాదాయ శాఖ ఆలయ కమిటీని ఏర్పాటు చేస్తుందని.. ఇప్పటికే కమిటీ సభ్యుల కోసం 30 దరఖాస్తులు వచ్చాని ఆయన చెప్పారు. తొందరలోనే కమిటీ సభ్యులను దేవాదాయ శాఖ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. వచ్చే వారం గోల్కొండ కోటలో మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందని ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. 

బడ్జెట్ రూ.15 లక్షలు..

గతేడాది నిర్వహించిన బోనాల జాతరలో అన్ని ఖర్చులు పోగా.. హుండీ ఆదాయంతో రూ.5 లక్షలు మిగులు బడ్జెట్ ఉందని ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు కేటాయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.