అట్టముక్కలు, ఆకుల్లో అన్నం

అట్టముక్కలు, ఆకుల్లో అన్నం

ఏడాదికి రెండు విడతల్లో గొర్లు ఇస్తున్నం : కేటీఆర్​
ముదిరాజ్​లకు ఏటా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నం 
దొడ్డి కొమురయ్య జయంతి, సదర్ పండుగ అధికారికంగా నిర్వహిస్తాం 
రంగారెడ్డిలో గొల్లకుర్మలు, ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనాలు 


ఎల్​బీ నగర్ : కుల వృత్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు.. దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కేంద్రమంత్రులే అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో గొల్లకుర్మలు, ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనాలు వేర్వేరుగా నిర్వహించారు. వీటిలో కేటీఆర్, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 

తెలంగాణ వచ్చాక గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపామని ఆయన చెప్పారు. రూ.11 వేల కోట్లతో ఏడాదికి రెండు విడతల్లో గొర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశం మొత్తం మీద ‘‘ఇన్ లాండ్ ఫిషరీ’’ ఏదంటే తెలంగాణనే అనే విధంగా ఎదిగాం. ముదిరాజ్​ లకు ఏటా రూ.110 కోట్లతో 28 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. దేశంలో మాదే పేదల ప్రభుత్వం” అని పేర్కొన్నారు. తాగు నీటి సమస్యను పరిష్కరించామని, ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. బలహీన వర్గాల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దొడ్డి కొమురయ్య జయంతి, సదరు పండుగలను అధికారికంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. 

గొల్లకుర్మలు మాట తప్పరు : హరీశ్ 
గొల్లకుర్మలది మాట తప్పని జాతి అని హరీశ్ రావు అన్నారు. గొల్లకుర్మల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనిపిస్త లేదా? అని మండిపడ్డారు. బాయిల కాడ మీటర్లు పెడతామంటూ రైతులను బెదిరిస్తూ పూటకో మాట మాట్లాడుతున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడులో ధర్మాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో గొల్లకుర్మల గురించి ఆలోచించినది కేసీఆర్ మాత్రమేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్లకుర్మలు అడగకుండానే గొర్ల పంపిణీ పథకం తీసుకొచ్చారని చెప్పారు. కొందరు దుర్మార్గుల కారణంగానే మునుగోడులో నగదు బదిలీ ఆగిపోయిందని మండిపడ్డారు. 

అట్టముక్కలు, ఆకుల్లో అన్నం
గొల్లకుర్మలు, ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులు భోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆకలితో అల్లాడారు. ప్లేట్లు దొరక్కపోవడంతో కొందరు టేకు ఆకులు, తువ్వాళ్లు, కొంగులు, అట్టముక్కల్లో అన్నం తిన్నారు. మీటింగ్ కు పిలిచి కనీసం అన్నం పెట్టేందుకు ఏర్పాట్లు చేయకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేశారు.