- ఆఫీసర్లు లాడ్జిలో ఉంటూ తమను పట్టించుకుంటలేరని ఆవేదన
- మంచి గొర్రెల కోసం గొల్లకురుమలగోస
ఖానాపూర్, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్తో పాటు తదితర గ్రామాలకు చెందిన గొల్లకురుమలు మంచి గొర్రెల కోసం ఇబ్బందులు పడ్తున్నారు. గొర్రెలను ఎంపిక చేసేందుకు నాలుగు రోజుల కింద జిల్లా ఆఫీసర్లు వీరిని ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు తీసుకెళ్లారు. అయితే వీరికి బక్కచిక్కిన గొర్రెలను చూపిస్తుండడంతో వారు వాటిని తిరస్కరిస్తున్నారు. ఇలా నాలుగు రోజుల నుంచి ఆఫీసర్లు లాడ్జీల్లో రెస్ట్ తీసుకుంటున్నారే తప్ప తప్ప సమస్యను పరిష్కరించడం లేదని యాదవ కురుమలు వాపోతున్నారు.
గుంటూరులో పడ్తున్న గోసను సోషల్ మీడియా ద్వారా తమ ఊరోళ్లకు తెలియజేశారు. బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, యాదవ సంఘం నాయకుడు తోకల బుచ్చన్న మాట్లాడుతూ.. గొర్రెలు కొనుడులో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపించారు. నాలుగు రోజులైనా ఇప్పటి వరకు గొర్రెలు ఇప్పించలేదని మండి పడ్డారు. ఈ విషయంపై కలెక్టర్ చొరవ చూపాలని కోరారు.