రాజులు కట్టించిన గుళ్లు, చారిత్రక కట్టడాలు వాళ్ల కాలంలోని వాస్తు, శిల్ప కళకి ఆనవాళ్లుగా నిలుస్తాయి. తెలంగాణలో అలాంటి ప్లేస్‌లు చాలా ఉన్నాయి. వాటిల్లో వెయ్యేండ్ల నాటి గాంధారి ఖిల్లా (కోట) ఒకటి. దీన్ని కాకతీయుల కాలంలో గోండు రాజులు కట్టించారని చెప్తారు. పెద్ద ఇసుక రాళ్ల మీద కట్టిన ఈ కోట ఎక్కి చూస్తే, పచ్చని చెట్లు కనిపిస్తాయి. రెండేండ్లకు ఒకసారి ఇక్కడ జరిగే మైసమ్మ జాతర చాలా ఫేమస్. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఉన్న బొక్కలగుట్ట ఊర్లో ఉంది ఈ కోట. ప్రకృతి ఒడిలో కొండల మధ్య ఉన్న ఈ కోట టూరిస్ట్‌లకి అడ్వెంచర్ చేసిన ఫీలింగ్‌ని ఇస్తుంది.
గోండు రాజుల నుంచి ఈ కోటని ఒడ్డి రాజు అనంతరాజు సొంతం చేసుకున్నట్టు అతడి పేరు మీదున్న శాసనంలో ఉంది. కోట ప్రధాన ద్వారం దగ్గర ఉన్న తోరణం, కోటలోని శిల్పాలు కాకతీయుల శిల్పకళని కళ్లకు కడతాయి. ఇక్కడ ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న పది తలల నాగశేషుడి విగ్రహం ఉంది. దీన్ని ఒకే రాయి మీద చెక్కడం విశేషం. రాళ్ల గోడల మీద చెక్కిన కాలభైరవుడు, శివుడు, గణపతి, ఆంజనేయుడి విగ్రహాల్ని చూడొచ్చు. ప్రతి విగ్రహం పక్కన శంఖువు, చక్రం బొమ్మ ఉంటుంది. దాంతో ఈ కోటని విష్ణువు... శివుడికి అంకితం చేసినట్టు చెప్తారు చరిత్రకారులు. ఇక్కడ మూడు బావులు ఉంటాయి. వీటి స్పెషా లిటీ ఏంటంటే.. ఎండాకాలంలోనూ వీటిలో నీళ్లు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ‘ఏనుగుల బావి’ ఉంది. ఏనుగులు, గుర్రాలు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేవట. గాంధారి కోట మీదకు వెళ్లే దారంతా పెద్ద చెట్లతో అడవిని తలపిస్తుంది. ఇందులో కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. దాంతో, ప్రాంతాన్ని ‘మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ సెంటర్’గా ప్రకటించారు.
మైసమ్మ జాతర ఫేమస్
గాంధారి ఖిల్లాలో మైసమ్మ గుడి ఉంది. ఇక్కడ రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి పూజలు చేసి, మొక్కులు చెల్లించేందుకు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గిరిజనులు భారీగా వస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ఆదివాసీలు ఈ జాతర చూసేందుకు వస్తారు. అంతేకాదు ప్రతి ఏడాది గాంధారి కోటలో మహంకాళి జాతర ఘనంగా జరుగుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వెళ్తారు.
ఇలా వెళ్లాలి
గాంధారి ఖిల్లా బొక్కల గుట్ట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచిర్యాల నుంచి 12 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే 270 కిలోమీటర్ల జర్నీ.