గారడీ మాటలకు మోసపోయే రోజులు పోయాయ్

గారడీ మాటలకు మోసపోయే రోజులు పోయాయ్

40 లక్షల మంది తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మిగిల్చిన కేసీఆర్ పాలనపై విద్యార్థి లోకం యుద్ధం ప్రకటించింది. ఆ నలుగురి పాలనను అంతం చేసి, వారిని నిరుద్యోగులుగా మార్చాలని పంతం పట్టింది. అందులో భాగమే దుబ్బాక దెబ్బ. జీహెచ్​ఎంసీ తీర్పు. తమకు ఎదురే లేదనుకున్న కారు బేజారయ్యే పరిస్థితికి వచ్చింది. నిరుద్యోగులు ఓటుతో వేటు వేశారు. నిరుద్యోగ యువత ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వ కుట్రలను, మోసాలను వివరించింది. అలా రాష్ట్రంలోని 4 కోట్ల మందిని చైతన్యం చేసే పనిలో బిజీ అయిపోయింది. ఈ 40 లక్షల మంది ఎవరనే ప్రశ్న మీకు రావచ్చు. వారెవరో కాదు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న 23 లక్షల మంది.. 2017 నుంచి ఇప్పటివరకు డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన 7 లక్షల మంది ఉన్నారు. కేసీఆర్ పాలనలో ఉపాధి లభిస్తుందనే భరోసా లేక, చిన్నాచితకా ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న వారు, వ్యవసాయంపై ఆధారపడ్డ వారు 10 లక్షల మంది ఉన్నారు.

రైతులు, పెన్షనర్లను చైతన్యపరుస్తూ ..

రైతులు, పెన్షనర్లను ఓటు బ్యాంకుగా టీఆర్ఎస్​ పార్టీ చూస్తోంది. పెన్షన్లు, రైతుబంధు ఇస్తే చాలు ఓట్లు పడిపోతాయనే నమ్మకంతో ఉంది. స్టూడెంట్లు, నిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణితో ఉంది. కానీ, పెన్షనర్లు, రైతులను చైతన్యపరిచి సర్కార్ కుయుక్తుల్ని యువత ఎండగడుతుందని ఊహించలేకపోయింది. రూ.2 వేల పెన్షన్​ కోసం తమ జీవితాలను ఆగం చేయొద్దని తాతాఅవ్వలను నిరుద్యోగులు వేడుకున్నారు. తమకు ఉద్యోగం వస్తే రూ.50 వేల జీతం వస్తుందని, అలా జరిగితే మీలాంటి వారిని ఆదుకునే స్తోమత వస్తుందని వివరించారు. ఈ ప్రభుత్వం మారినా పెన్షన్లు ఆగవని, తమకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ కు ఓటు వేయొద్దని ఒప్పించారు.

సర్కారు మోసాలను వివరిస్తూ..

అటు రైతుబంధు పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. ప్రస్తుతం ఎకరాకు రూ.5 వేలు  రైతుబంధు పేరుతో ఇచ్చి పంటలు ఏం వేయాలో ప్రభుత్వమే నిర్ణయించింది. దీనివల్ల వందల ఎకరాలున్న భూస్వాములు లాభపడ్డారు తప్ప సన్నచిన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. రైతులు ఏ పంట వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. రైతుబంధు రావాలంటే సన్న వడ్లు వేయాలని సీఎం హుకుం జారీ చేశారు. చేసేది లేక 98 శాతం మంది రైతులు సన్న వడ్లు వేసారు. తీరా చూస్తే పంటకు తెగులు, దోమ కాటు మొదలైన కారణాలతో ఎకరాకు 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 20 క్వింటాళ్లకు పడిపోయింది. 40 క్వింటాళ్లకు రూ.70 వేలు రావాల్సి ఉండగా.. అది దిగుబడి తగ్గి రూ.35 వేలే వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ లో ముంపు బాధితులకు రూ.10 వేలు పరిహారం ప్రకటించారు. ఆ పరిహారంలో కొంత భాగం కార్పొరేటర్ల జేబుల్లోకి చేరింది. కొందరికైతే అసలు పరిహారమే అందలేదు. ఇదే సమయంలో వరదల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ఎన్నికలు ఉంటే ఒకరకంగా లేకుంటే మరోరకంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని నిరుద్యోగ యువత రైతులకు వివరించింది.

నిరుద్యోగ భృతి లేదు.. నియామకాలు లేవు

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఉద్యమంలో స్టూడెంట్లు, నిరుద్యోగులు పాల్గొన్నదే నియామకాల కోసం. కానీ, సొంత రాష్ట్రంలో వారి ఆశలు నెరవేరలేదు. ఎంతో మంది చేసిన త్యాగాలకు విలువ లేకుండా పోయింది. 83 వేల మంది ఆంధ్రా వాళ్లు అక్రమంగా తెలంగాణలో కొనసాగుతున్నారని, వారందరినీ వారి రాష్ట్రానికి పంపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వారిలో ఎంతమందిని పంపించారో సమాధానం చెప్పాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏటా 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యారు. ఈ ఖాళీలు 60 వేలు. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాకో 5 వేల ఉద్యోగాలు కొత్తగా అవసరమైనా లక్షా 15 వేల మంది అవసరం. దీంతో రాష్ట్రంలో మొత్తం 3 లక్షల 66 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎన్ని భర్తీ చేశారు. అడగకుండానే నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్​ పార్టీ.. దాని అమలును మాత్రం పట్టించుకోలేదు. నిరుద్యోగులు ఎవరూ భృతి అడగలేదు.. పని చేసి జీతం తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ నోటిఫికేషన్ అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.

50 వేల ఉద్యోగాల భర్తీ ఓ డ్రామా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అప్పటికే ఖాళీగా ఉన్న లక్షా 8 వేల ఉద్యోగాలను ఐదారు నెలల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆరేండ్లలో 35,724 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్​ ఘంటా చక్రపాణి గవర్నర్​కు రిపోర్ట్​ ఇచ్చారు. ఇవికాక మరికొన్ని పోలీసు జాబులను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మరి  లక్షా 8 వేల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ చేశారో సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలి. బీఈడీ, డీఈడీ చదివిన వారికి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) నిర్వహించకుండా ఉపాధ్యాయ పోస్టులను  భర్తీ చేయడం ఎలా సాధ్యమవుతుంది? జోనల్ వ్యవస్థ తేలకుండా జేఎల్, డీఎల్ పోస్టులను భర్తీ చేయడం అయ్యే పనేనా? దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బలకు రాష్ట్ర సర్కారు పెద్దలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే 50 వేల ఉద్యోగాల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక ఉండడంతో.. స్టూడెంట్లు, నిరుద్యోగులు ఓడిస్తారనే భయంతో నోటిఫికేషన్ల పేరుతో కొత్త డ్రామాకు తెర తీసింది. 50 వేల ఉద్యోగాల భర్తీ అంతా స్టూడెంట్లు, నిరుద్యోగులను వంచించేందుకు టీఆర్ఎస్ అడుతున్న మరో నాటకం. కానీ, స్టూడెంట్లు, నిరుద్యోగులు వీటిని నమ్మే పరిస్థితిలో లేరనే నిజాన్ని గులాబీ బాస్ గుర్తిస్తే మంచిది.-సిద్ధగౌని సుదర్శన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేత.