వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : ఒక జట్టుగా మెగా టోర్నమెంట్‌లో ఇండియా అమ్మాయిలు అద్భుతంగా ఆడినా.. ప్రతీ దశలోనూ తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రికెటర్ మన గొంగడి త్రిష. ఏడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో 309 రన్స్ చేసి.. ఏడు వికెట్లు పడగొట్టిన త్రిష పెర్ఫామెన్స్ ఈ టోర్నీకే ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. టోర్నీ టాప్ స్కోరర్ల రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ పెర్రిన్ 176 రన్స్ చేసింది. ఈ లెక్కన ఒక బ్యాటర్‌గా మెగా టోర్నీలో త్రిష ఏ రేంజ్‌లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
రెండేండ్ల కిందట తొలి ఎడిషన్‌లో కప్పు నెగ్గిన టీమ్‌లోనూ తెలంగాణ అమ్మాయి మెంబర్. కానీ, నాడు మిడిలార్డర్‌లో ఆడటం వల్ల తన సత్తా నిరూపించుకునే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ రెండేండ్ల విరామంలో తన గేమ్‌ను ఆమె ఎంతగానో ఇంప్రూవ్ చేసుకుంది. చిన్నప్పటి నుంచే నిర్భయంగా ఆడుతూ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టడం తనకు అలవాటు.
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఫార్మాట్‌లో మరింత వేగంగా ఆడాలని గ్రహించింది. దాంతో పవర్ గేమ్‌పై ఫోకస్ పెట్టి.. భారీ షాట్లపై మరింత దృష్టి సారించింది. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో త్రిష తన విశ్వరూపం చూపెట్టింది. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టింది. మెగా టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచింది.
వరల్డ్ కప్‌లో రెండో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు నమోదు చేయడంతో పాటు అత్యధిక ఫోర్లు, రెండో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా తన మార్కు చూపెట్టింది. పేస్ బౌలర్ నుంచి లెగ్ స్పిన్నర్‌గా మారిన తెలంగాణ ప్లేయర్ మెగా టోర్నీలో బంతితోనూ మ్యాజిక్ చేసింది. సెమీఫైనల్, ఫైనల్లో తన లెగ్ స్పిన్‌తో ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లకు సవాల్ విసిరింది.
నెల కిందట ఇదే కౌలాలంపూర్‌లో జరిగిన అండర్19 ఆసియా కప్‌లోనూ సూపర్ పెర్ఫామెన్స్ చేసిన త్రిష ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు నెగ్గింది. మొత్తంగా తన చివరి 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో త్రిష రెండు ఫిఫ్టీలు, ఒక సెంచరీలతో 451 రన్స్ చేసి 7 వికెట్లు పడగొట్టింది. ఒక తపస్సు చేస్తునట్టుగా ఇంత నిలకడగా ఆడుతున్న త్రిషను డబ్ల్యూపీఎల్‌లోకి తీసుకోని ఫ్రాంచైజీలు ఇప్పుడు కచ్చితంగా బాధపడుతుంటాయి.
ఇండియా సీనియర్ టీమ్‌కు ఆడే అన్ని అర్హతలు త్రిషలో ఉన్నాయి. ఫామ్ కోల్పోయిన హిట్టర్ షెఫాలీ వర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు తెలంగాణ క్రికెటర్ సిద్ధంగా ఉంది . తన వయసు 19 ఏండ్లే. ఇదే జోరును సీనియర్ లెవెల్ లోనూ కొనసాగిస్తే త్రిషకు తిరుగు ఉండదు. మిథాలీ రాజ్ తర్వాత తెలంగాణ నుంచి ఇండియా విమెన్స్ టీమ్‌కు మరో స్టార్ దొరికనట్టే.
నాన్న లేకుంటే నేను లేను
రెండుసార్లు వరల్డ్ కప్ విన్నర్ అనే ఫీలింగ్ సూపర్‌గా అనిపిస్తోంది. ఈ ఆనంద క్షణంలో నా నోట మాటలు రావడం లేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఇక్కడే ఉన్న మా నాన్న (రామిరెడ్డి)కు అంకితం ఇస్తున్నా. మా నాన్న ప్రోత్సాహం లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నన్ను సపోర్ట్ చేసిన తోటి ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌కు కూడా థ్యాంక్స్. నేను మిథాలీ రాజ్ బ్యాటింగ్‌ను చూస్తూ పెరిగా. ఆమె నా ఆరాధ్య క్రికెట్. దేశానికి ఆడుతూ మరిన్ని మ్యాచ్‌లు గెలవడమే నా లక్ష్యం. –త్రిష