యాదాద్రి, వెలుగు: పంట రుణాల మాఫీ, గృహ లక్ష్మి వంటి పథకాల అమలుతో బీఆర్ఎస్ మైలేజ్ మరింత పెరిగిందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ స్టేట్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ బంధుతో బీసీలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. వారంతా బీఆర్ఎస్ కు అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ చేయించిన ప్రతి సర్వేలో ఆలేరు నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నట్టు తేలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో గొంగిడి సునీత ముచ్చటగా మూడోసారి ఆలేరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.